సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీకి సంబంధించి టీఆర్‌ఎస్ నుంచి ఎవరూ సంప్రదించలేదని, ప్రస్తుత పదవితో సంతృప్తిగా ఉన్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది జూన్‌లో శాసనమండలి సభ్యుడిగా తన పదవీకాలం ముగుస్తుందన్నారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును పార్టీ అధినేత నిర్ణయిస్తారన్నారు. మండలిలోని తన కార్యాలయంలో శనివారం గుత్తా మీడియాతో మాట్లాడారు. సాగర్‌లో స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం అర్ధరహితమని, నాయకులందరూ హైదరాబాద్‌లో మకాం వేసి రాకపోకలు సాగిస్తున్నారన్నారు.
సీఎంగా కేటీఆర్‌కు అన్ని అర్హతలు
‘ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మంత్రి కేటీ రామారావుకు అన్ని అర్హతలు ఉన్నాయి. పాలనా సామర్ద్యం ఉంది’అని గుత్తా పేర్కొన్నారు. ‘ఇటీవలి కాలంలో కొందరు ఎంపీలు వాడుతున్న పదజాలం ఘోరంగా ఉంటోంది. తాత్కాలికంగా నాలుగు ఓట్లు వస్తాయేమో కానీ భవిష్యత్తు తరాలకు ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరహాలో సాగర్ ఫలితం ఉండదు. నల్గొండ జిల్లా రాజకీయ పరిస్థితులు వేరు. రాజకీయాల్లో ఎవరికీ ఎవరూ పోటీ కాదు’ అని గుత్తా వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోసమే ప్రమోషన్లు, పీఆర్సీ: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ అంశాలను ముందుకు తెచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. విద్యా వ్యవస్థ, ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని ధ్వజమెత్తారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ఒక్క పోస్టయినా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4 వేల ప్రధానోపాధ్యాయుల పోస్టులు, 92 శాతం ఎంఈవోలు, సగం డీఈవో పోస్టులతో పాటు వెయ్యికి పైగా ఉర్దూ మీడియం పోస్టుల ఖాళీలతో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందని విచారం వ్యక్తంచేశారు. తక్షణమే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే పీఆర్సీని వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తాబేదారులై అడుక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ముందు పార్టీకి రాజీనామా చెయ్: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వేరే పార్టీ లో చేరాలనుకుంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని జీవన్‌రెడ్డి అన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, కొందరు నేతలు వ్యక్తిగత స్వార్థంతోనే పార్టీలు మారుతున్నారన్నారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయొద్దంటూ రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment