అయితే తిట్టు..లేదంటే ఒట్టు | Sakshi
Sakshi News home page

అయితే తిట్టు..లేదంటే ఒట్టు

Published Mon, Apr 29 2024 4:40 AM

Harish Rao comments over Revanth Reddy

మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు  

సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం 

రాష్ట్రంలో త్వరలోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్య  

వెల్దుర్తి (తూప్రాన్‌), చిన్నశంకరంపేట(మెదక్‌): సీఎం రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అయితే తిట్టు.. లేదంటే ఒట్టు అన్నట్లుగా ఆయన విధానం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రేవంత్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో, చిన్నశంకరంపేటలో నిర్వహించిన సభలో హరీశ్‌ మాట్లాడారు.

తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన గుంపుమేస్త్రీ గువ్వ గుయ్యిమనేలా ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. హామీల అమలు చేయమని సవాల్‌ చేస్తే తోకముడిచి పారిపోయారని విమర్శించారు. మండుటెండల్లో గోదావరి నీరు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడిగిన మాజీ సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని కోరారు. బీజేపీకి ఓటేస్తే ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుందన్నారు. 

బీజేపీతో చేతులు కలిపి ముస్లింలకు మోసం 
మైనార్టీలకు కనీసం కేబినెట్‌లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ముస్లింలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలను రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం రంజాన్‌ తోఫా కూడా అందించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ హామీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరితే సీఎం పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో త్వరలోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని.. ప్రజలకు మేలు చేస్తుందని హరీశ్‌ చెప్పుకొచ్చారు.   

Advertisement
Advertisement