అంతన్నారు ఇంతన్నారు.. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పదవితో బాటు కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తారని, ఇంకా కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని ఊదరగొట్టారు.. చూస్తే చివరకు ఆమెకు ఏమీ లేకుండా పోయింది.
అప్పట్లో ఆమె తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ కాంగ్రెసులో విలీనం చేసినప్పుడే ఆమెకు రాజ్యసభ హామీ ఉందని అన్నారు.. కానీ చివరకు ఏం జరిగింది. దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనికోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఈనెల 15 తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువుంది. కానీ ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున షర్మిలకు టిక్కెట్ అయితే దక్కలేదు.
ఒకనాడు యావద్దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడక్కడా మిణుకుమిణుకుమంటూ వెలుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ, హిమాచల్, కర్ణాటకలో మాత్రం అధికారంలో ఉండగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటిచోట్ల చెప్పుకోదగ్గ సీట్లతో ప్రతిపక్షంలో ఉంది. వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తే ఓ పది వరకు సీట్లు కాంగ్రెసుకు రావచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది. ఐతే ఈ క్రమంలో విజయ్ మాకెన్ వంటి కొందరు పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ షర్మిల పేరును మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. దీంతో ఆమెకు ఇన్నాళ్లుగా జరిగింది ప్రచారమే తప్ప ఆమెకు ఇంకేం లేదని అంటున్నారు.
ఆమెను కేవలం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీద విమర్శలు.. నిరాధార ఆరోపణలు చేయడం కోసమే వాడుకుంటున్నారు తప్ప అంతకు మించి ప్రాధాన్యం ఉండదు అని.. ఆమె అటు చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీలకు పావుగా ఉపయోగపడడం ఆంధ్రాలో గౌరవాన్ని పోగొట్టుకోవడం మినహా ఆమెకు రాజకీయ కెరీర్ ఉండదు అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అంటున్నారు.
-సిమ్మాదిరప్పన్న
ఇదీ చదవండి: Pawan Kalyan: అనువుగాని చోట..!
Comments
Please login to add a commentAdd a comment