
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సాధారణంగా ఏ విషయంలోనూ పెద్ద క్లారిటీ ఉండదన్నది ఆయనపై జన సామాన్యంలో ఉన్న భావన. దానిని ఆయన ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన చూడండి. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. పవన్‌కు ఒక సిద్ధాంతం అంటూ ఏమీ ఉండదు. కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని అధికారంలో లేకుండా చేయడమెలా అన్నదే ఆయన ఆలోచన. అదే సిద్ధాంతం. బాగా నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇందుకోసం టీడీపీతో కలవడానికి చేయని ప్రయత్నం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా పదే పదే లవ్ సంకేతాలు పంపుతున్నారు. కానీ అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. దానికి కారణం పవన్ తాను బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో లవ్లో ఉండడమే.
ముందుగా బీజేపీతో విడాకులు తీసుకుంటే కానీ, టీడీపీతో కలవడానికి వీలు ఉండదు. బీజేపీతో నిమిత్తం లేకుండా తనదారిన తాను చంద్రబాబు చెంతకు వెళ్లవచ్చుకానీ, బీజేపీ వారికి ఎక్కడ కోపం వస్తుందోనని ఈ రెండు పార్టీలు భయపడుతున్నాయి. అలా చేస్తే టీడీపీతో జనసేన లేచిపోయిందన్న విమర్శ రావచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కానీ, ఆయన సహచరుడు ,మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కానీ పలు విన్యాసాలు చేస్తున్నారు. కొన్ని ఉప ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వడం, మరో సందర్భంలో స్థానిక ఎన్నికలలో కొన్ని చోట్ల టీడీపీకి మద్దతు ఇవ్వడం వంటివి చేశారు. ఈ రకంగా ఈ విషయంలోను జనసేనకు క్లారిటీ లేదని తేలుతుంది.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కొత్త కోణం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. తద్వారా మళ్లీ తనకు క్లారిటీ లేదని పవన్ కళ్యాణ్ రుజువు చేసుకున్నారు. తన రాజకీయ పార్టనర్ అయిన బీజేపీ అభ్యర్ధి మాధవ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు ఆయనకు ఎందుకు పవన్ మద్దతు ఇవ్వలేదు? అంటే బీజేపీకి ఓటు వేయనవసరం లేదని ఆయన భావిస్తున్నారా? పోనీ అలా అని తాను ప్రేమలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పారా? అంటే అదీ చేయలేదు. దానికి కారణం బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న సంశయమే. బీజేపీని కూడా టీడీపీ వైపు తీసుకు వెళ్లాలని చాలా గట్టి ప్రయత్నమే చేశారు కానీ, ఆ పార్టీ అధినేతలు అందుకు అంగీకరించలేదు.
2019లో జనసేన ఘోర పరాజయం చెందిన తర్వాత డిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి బతిమలాడి మరీ ఆ పార్టీతో స్నేహం కుదుర్చుకున్నారు. అది కూడా చంద్రబాబు సలహా మేరకే జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ తర్వాత జనసేన తరఫు రాజకీయం అంతా కూడా చంద్రబాబే నడిపారని అంటారు. ఆయన ఏమి చెబితే అదే పవన్ మాట్లాడారని, ప్రకటనలు చేశారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అదే విధానాన్ని కొనసాగిస్తుండవచ్చు. బహుశా ఈ విషయంలో మాత్రం పవన్కు క్లారీటీ ఉండవచ్చు. కానీ ఆ క్రమంలో ఆయన తన అభిమానులను గందరగోళంలో పడవేస్తున్నారు. ఇంతకీ తాము మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలా? లేదా ? అన్నది వారికి అర్థం కాకుండా పోయింది.
అలాగనీ టీడీపీకి ఓటు వేయమని చెప్పకపోవడంతో వారు అయోమయానికి గురి అవుతున్నారు. పవన్‌కు టీడీపీతో ప్రేమ ఉంది కనుక ఆ పార్టీకి ఓటు వేయాలని కొందరు భావించవచ్చు. లేదా బీజేపీతో మితృత్వం ఉంది కనుక ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని మరికొందరు భావించవచ్చు. లేదా పైకి వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినా, లోలోపల బీజేపీకి కాకుండా టీడీపీకే ఓటు వేయాలని సందేశాలు పంపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బీజేపీని మరోసారి ఆయన వెన్నుపోటు పొడిచినట్లు అవుతుందన్నమాట.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఎంతమంది జనసేన మద్దతుదారులు ఉంటారో తెలియదు కానీ, బహుశా టీడీపీ, బీజేపీలలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి తాము మద్దతు ఇచ్చామని చెబితే చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఆ పార్టీకే విజయావకాశాలు ఉండవచ్చు. అందువల్ల ఆ పార్టీని గెలవనివ్వరాదన్న లక్ష్యంతో పవన్ ఈ ప్రకటన చేశారు. అయినా దీనివల్ల సరైన క్లారిటీ లేక జనసేన గ్రాడ్యుయేట్లు ఎవరికి నచ్చిన అభ్యర్థులకు వారు ఓటు వేసుకుంటారేమో చూడాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment