పవన్ కల్యాణ్ సెంటిమెంట్లకు, ఇంకా సూటిగా చెప్పాలంటే మూఢ నమ్మకాలకు చాలా చాలా విలువ ఇచ్చే వ్యక్తి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన తన అత్యంత విశ్వసనీయుడైన సహచరుడితో కలిసి క్షుద్రపూజలు కూడా చేయిస్తూ ఉంటారని, ఆ క్షుద్రపూజలే ఎన్నికల్లో గెలిపిస్తాయనే విశ్వాసంతో కూడా ఉంటారని కూడా గతంలో విస్తృతంగా ప్రచారం అయింది. అలాంటి పవన్ కల్యాణ్ ఒక్కో సమయంలో ఒక్కో రకం సెంటిమెంటును ఆశ్రయిస్తుంటారు. ఈసారి 2024 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన ‘క్లీన్ షేవ్’ సెంటిమెంటును నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ తరచుగా బవిరిగడ్డంతో కనిపిస్తూ ఉంటారు. నిజానికి సినిమా హీరోలు చాలా వరకు షూటింగులు లేని సమయాల్లో గడ్డం మెయింటైన్ చేస్తూ షూటింగు ఉన్నప్పుడు మాత్రం ఆ పాత్ర అవసరాన్ని బట్టి క్లీన్ షేవ్ చేసుకుంటూ ఉంటారు. పవన్ కల్యాణ్, రాజకీయ నేతగా నిత్యం గడ్డంతో కనిపించడాన్నే ప్రజలకు అలవాటు చేశారు. గడ్డంతో మాత్రమే తన మొహానికి కాస్త పెద్దరికం వస్తుందని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు. లేదా గడ్డంతో వెళితే గొప్ప రాజకీయ నాయకుడు అయిపోతావని ఎవరైనా స్వాములు ఆయనకు ఉపదేశించారో తెలియదు. మొత్తానికి గడ్డంతోనే రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆయన సాధించిన ఫలితం సున్నా. ఈ ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. ముందుగా గడ్డాన్ని పూర్తిగా త్యజించారు. ఎప్పుడు చూసినా ‘క్లీన్ షేవ్డ్’ గా కనిపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ‘క్లీన్ షేవ్’ లుక్ గెలిపిస్తుందనే సెంటిమెంటు ఆయనను ముందుకు నడిపిస్తున్నట్టుగా ఉంది.
పాపం ఎన్నికల సీజన్లో పవన్ ఇంకా అనేక సెంటిమెంట్లను కూడా పక్కన పెట్టారు. గత ఎన్నికల సమయానికి ఆయన మెడలో అందరికీ కనిపించేలా కట్టుకున్న ఒక తావీదు సాయంతో రాజకీయం చేశారు. ఎర్రటి దారానికి కట్టిన తావీదు ఉండేది. తావీదు మహిమ తనను గెలిపిస్తుందనే ఆయన బలంగా నమ్మారు. కానీ అది పనిచేయలేదు. తావీదు ఎంత దారుణంగా ప్రతికూల ఫలితాన్నిచ్చింది. పార్టీ తరఫున ఒక్కడు గెలిస్తే, గెలిచిన వెంటనే ఫిరాయించేశాడు. స్వయంగా పవన్ రెండుచోట్ల ఓడిపోయారు.
తావీదు మీద ఆయనకు నమ్మకం పోయింది గానీ.. చాలాకాలం దానిని కొనసాగించాడు. ఈలోగా ఉంగరాల పిచ్చి పట్టుకుంది. రాళ్ల ఉంగరాలు ధరిస్తే రాజయోగం పడుతుందని బాబాలో, స్వాములో మళ్లీ పవన్ చెవిలో ఊదినట్టున్నారు. వెంటనే ఆయన బాగా స్ఫుటంగా కనిపించేలా ఎర్రటి పెద్ద రాయి, పగడం లాంటిది, పొదిగిన ఉంగరాన్ని ధరిస్తూ దూసుకెళ్లిపోయారు. ఆ ఉంగరాల ప్రభావం కూడా రాజకీయ వైభవాన్ని అందించలేదు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ మొత్తంగా స్టైల్ మార్చారు. చేతులకు ఉన్న పదివేళ్లకూ ఒక్క ఉంగరం కూడా లేదు. రాళ్ల ఉంగరాలు గానీ, ఇతరత్ర మంత్ర శక్తులు ఆవాహన చేసిన బంగారు ఉంగరాలు గానీ పెట్టుకోవడం లేదు. తాయెత్తులు ధరించడం లేదు. ఎట్ లీస్ట్ మెడలో అందరికీ కనిపించేలా ధరించడం లేదు. గడ్డాన్ని కూడా పరిత్యజించారు. క్లీన్ షేవ్డ్ వ్యక్తిగా, ఏ ఎగస్ట్రా సెంటిమెంటు ఆభరణాలు, తొడుగులు లేని మనిషిగా ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు. మరి ఈ క్లీన్ షేవ్ సెంటిమెంట్ కనీసం ఆయననైనా గెలిపిస్తుందా? లేదా, ఫలితాలు కూడ క్లీన్ షేవ్ అయిపోతాయా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది.
పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. తమ పార్టీ స్థాయికి తగినన్ని సీట్లు పొందడంలోనే విఫలం అయ్యారు. ఆ రకంగా చూస్తే ఇప్పటికే పాక్షికంగా ‘షేవ్’ అయినట్టే. ఎన్నికల ఫలితాల తర్వాత ‘క్లీన్ షేవ్’ అయినట్టా కానట్టా అని తేలుతుంది!.
-వంశీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment