వాళ్ల తప్పులపై ఎదుగుదాం | JP Nadda Directed BJP Use TRS Mistakes And Grow In Telangana | Sakshi
Sakshi News home page

వాళ్ల తప్పులపై ఎదుగుదాం

Published Fri, Jan 7 2022 3:34 AM | Last Updated on Fri, Jan 7 2022 3:36 AM

JP Nadda Directed BJP Use TRS Mistakes And Grow In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం, అధికార టీఆర్‌ఎస్‌ తప్పుల మీద తప్పులు చేస్తున్నాయని, వాటన్నింటినీ ఉపయోగించుకుని తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాక్షేత్రంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టడంలో నేతలు సఫలీకృతం అవుతున్నారని, మరోవైపు టీఆర్‌ఎస్‌పై ప్రజాగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. గురువారం రాత్రి మహేశ్వరం మండలంలోని మాక్‌ ప్రాజెక్ట్‌లో పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో.. బెయిల్‌పై బయటకు వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను, ఇతర నాయకులను నడ్డా అభినందించారు.  

దూకుడు మరింత పెంచండి 
రాష్ట్రంలో బీజేపీ ఉద్యమ స్ఫూర్తిని నడ్డా ప్రశంసిం చారు. బండి సంజయ్‌ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ బాగా పనిచేస్తోందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలు, అంశాలపై మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి బీజేపీకి అనుకూలంగా మద్దతు కూడగట్టాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలనపై పట్టుకోల్పోవడంతోపాటు హామీల అమల్లో వైఫల్యం చెందిందని, దీనిని జీర్ణించుకోలేకే ఆ పార్టీ పెద్దలు సంయమనం, గౌరవ మర్యాదలు కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.  

ఇకముందు కూడా కలిసికట్టుగా: సంజయ్‌ 
బండి సంజయ్‌ మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పార్టీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన జాతీయ పార్టీకి, ముఖ్యంగా జేపీ నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గొప్ప ఉద్యమంలో రాష్ట్ర నాయకులు కూడా అండగా నిలిచారన్నారు. ఇకముందు కూడా టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో కలిసికట్టుగా ముందుకెళదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు నడ్డాను, సంజయ్‌ను సన్మానించారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం డాక్టర్‌ రమణ్‌సింగ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, పార్టీ నేతలు డాక్టర్‌ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, డాక్టర్‌ జి.వివేక్‌ వెంకటస్వామి, నల్లు ఇంద్రసేనారెడ్డి, రాజాసింగ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి డాక్టర్‌ జి.మనోహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement