సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) విషయంలో బీజేపీ తాజా వైఖరి ఆ పార్టీ నేతలను ఒకింత అసంతృప్తి, ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలో పాలన తీరు.. కేసీఆర్, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణల విషయంలో మెతకగా వ్యవహరించాలన్న సంకేతాల అంశం బీజేపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఎదిగి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఈటల రాజేందర్, కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు అంచుల వరకు వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల సేవలను బీజేపీ విస్తృత స్థాయిలో వినియోగించుకోలేక పోతోందన్న ఆవేదనను వారి అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ విషయంలో మారిన పార్టీ వైఖరితో పాటు సమర్థులైన నాయకులను సరైన పద్ధతిలో వాడుకోలేక పోతోందన్న విషయంలో ఈ ఇద్దరి నాయకులపై క్యాడర్ నుండి తీవ్ర ఒత్తిడి వస్తోందని సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత కేసీఆర్, ఆయన ప్రభుత్వం, ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కేసుల విషయంలో వేగం తగ్గిందని, ఇది బీజేపీ క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేయడంతో పాటు వారిలో అనుమానాలకు కారణమవుతోందని అంటున్నారు.
ఇన్నాళ్లు కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తాము ఇప్పుడెలా ప్రజల్లోకి వెళతామని, కేసీఆర్‌పై పోరాడే పార్టీలోనే మనం ఉండాలని హుజూరాబాద్, మునుగోడు నియోజకవర్గాల క్యాడర్ అంటున్నట్లు సమాచారం. కార్యకర్తలు, ముఖ్య అనుచరుల నుండి పెరుగుతోన్న వత్తిడి నేపథ్యంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు గత కొన్ని రోజులుగా దాదాపు ప్రతిరోజూ భేటీ అవుతున్నారు.
తాము కేసీఆర్, ఆయన కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికల యుద్ధంలో పాల్గొన్నామని, ప్రస్తుత కీలక దశలో బీఆర్‌ఎస్ విషయంలో బీజేపీ రాజకీయ వైఖరిని మార్చుకునే పరిస్థితి ఉంటే తాము.. మెజారిటీ కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పోరాట పంథాను రూపొందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడి బీఆర్‌ఎస్‌కు పరోక్ష మద్దతిచ్చే బీజేపీలో కొనసాగే పరిస్థితి ఉండదంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అంతా ఉమ్మడి వేదికపైకి..
ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలపై కింది స్థాయి నుంచి వత్తిడి వస్తోన్న నేపథ్యంలో త్వరలో రాజగోపాల్ ఆధ్వర్యంలో ఓ కీలక సమావేశం నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమ అనుచరులతో పాటు సబ్బండ వర్గాలు, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, యువజన ప్రతినిధులతో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వచ్చే ప్రతిపాదన దిశగా తమ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
తెలంగాణ రాష్ట్ర అవిర్భావానికి ముందు ఇక్కడి ప్రజలు ఏం కోరుకున్నారు?, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది?, ఇందులో బీఆర్‌ఎస్ నేతల అవినీతి, బంధుప్రీతి ఎలా రాజ్యం చేసింది? తదితర అంశాలపై చర్చించి, అందులో వచ్చే ఏకాభిప్రాయం ద్వారా తమ రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ దిశగానే గడిచిన వారం రోజులుగా రాజగోపాల్‌రెడ్డి పలువురు కీలక నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
వలస నేతల ‘ఉక్కపోత’!
Published Tue, Jun 20 2023 3:19 AM | Last Updated on Tue, Jun 20 2023 10:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment