బీఆర్‌ఎస్‌కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా | Komati Reddy Venkat Reddy challenge to brs | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా

Published Thu, Apr 25 2024 3:40 PM | Last Updated on Thu, Apr 25 2024 5:32 PM

Komati Reddy Venkat Reddy challenge to brs

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు రెండు సీట్లు వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఎన్నికల తరువాత ఆ పార్టీ ఉండదన్నారు. బుధవారం నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా నల్లగొండ వీటీకాలనీలోని  వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్‌ పత్రాలతో పూజలు నిర్వహించారు.

అనంతరం భారీ ర్యాలీగా గడియారం సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కోమటిరెడ్డి మాట్లాడారు. సాగర్, శ్రీశైలంలను ఎండబెట్టిన ద్రోహి కేసీఆర్‌ అని, అలాంటిది ఏ మొహం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నారన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే కేసీఆర్‌ మాత్రం దొంగదీక్ష చేశాడంటూ దుయ్యబట్టారు.  

రేవంత్‌ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: ఉత్తమ్‌ 
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్నాయంటూ ఇటీవల భువనగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని చెప్పారు.

రైతులను మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మంత్రిగా మాటిస్తున్నా. ఎస్‌ఎల్‌బీసీని, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఎన్నికల తర్వాత కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement