రాజకీయాలలో బుకాయించడం, దబాయించడం, తన వైఫల్యాలను ఎదుటి వారిపైకి నెట్టేయడం వంటి లక్షణాలు బాగా తెలిసి ఉండాలంటారు. ఈ లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వాళ్లు లేరనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈయన చేసే ప్రయత్నాలను అధ్యయనం చేయడం కూడా చాలా ఆసక్తికరం. అయితే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మాత్రం బాబుతో ఈ లక్షణాల విషయంలో ఏమాత్రం పోటీ పడలేరు అనిపిస్తుంది. చంద్రబాబు ఏ అంశంతోనైనా నాటకాన్ని ఆడించగలరు. రక్తికట్టించగలరు కూడా. జగన్ కు ఈ డ్రామాలేవీ అలవాటు లేదు. తాను చేయాలనుకున్నది అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు చేయడం.. పనులు సజావుగా సాగేలా చూడటం వరకే జగన్ వ్యవహరిస్తూంటార. చంద్రబాబు మాత్రం అన్నీ తానే దగ్గరుండి మరీ చేయిస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తూంటారు. చేసే చిన్న పనికైనా పెద్ద ఎత్తున ప్రచారం జరిగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. ఇందుకు తాజా నిదర్శనం విజయవాడను ముంచెత్తిన వరదలు!
రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు విజయవాడ జలమయమై పోయింది. లక్షల మంది వరదల్లో చిక్కుకుని నానా యాతనా పడుతున్నారు. బాబు కలల రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం వరదనీటిలో మునిగిపోయింది. చివరికి చంద్రబాబు కరకట్ట అక్రమ కట్టడంతోపాటు కృష్ణానది తీరంలో ఉన్న పలు భవనాలలోకి కూడా నీరు చేరింది. అయినా సరే.. బాబుగారు అందరి దృష్టి మళ్లించేందుకు ఏం చేశారో చూడండి.
విజయవాడ వరద బాధితుల రక్షణ చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్‌లో బస చేస్తానని చెప్పాడు. ఇందుకు తగ్గట్టుగా అక్కడ ఆయనకు ఓ బస్‌లో ఏర్పాట్లూ జరిగిపోయాయట. తానున్న అక్రమ కట్టడంలోకే నీళ్లు చేరాయని చెబితే నగుబాటని బాబుకు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా ప్రజల కోసం కలెక్టరేట్‌లో బస చేస్తున్నట్లు చెప్పారన్నమాట. పర్యవేక్షణ కలెక్టరేట్ నుంచి చేసినా.. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఇంట్లోంచి చేసినా పెద్ద తేడా ఏమీ ఉండదు.పైగా... ఈ పర్యవేక్షణేదో రెండ్రోజుల ముందు చేసి ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావు. ఇదే మాట ఎవరైనా అంటే మాత్రం వారిపై ఒంటికాలిపై లేస్తారు. అర్ధరాత్రిళ్లు కూడా బాధితులను ఆదుకునేందుకు పర్యటించానని.. అయినా తనను ఇలా అంటారా? అలా అంటారా? అని చెబుతారే గానీ.. అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు.
భారీ వర్షాలు రానున్నాయన్న వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను బాబు అండ్ కో ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో సమాధానం లేదు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను ముందుగానే ఎందుకు ఖాళీ చేయించలేదో చెప్పరు. వందల మందినైతే తరలించగలం కానీ.. జనాలు లక్షల్లో ఉంటే ఏం చేయగలమని బుకాయిస్తారు.
సాధారణంగా వరద వస్తోందని చెబితే ప్రజలే ఇళ్లు ఖాళీ చేసి వేర్వేరు చోట్లకు వెళ్లిపోతారు. ఎందుకంటే బుడమేరు వరదకు గురైన ప్రాంతాల్లోని వారు ఎక్కువగా మధ్య తరగతి వారే. ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాల కోసం వారు ఎదురు చూడరు. తమంతట తామే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటారు. ఇళ్లలోని సామాను పాడు కాకుండా జాగ్రత్త పడతారు. అయితే తాజా వరద తీవ్రత ఏమిటో తెలియక చాలామంది డాబాలపైకి వెళ్లిపోయారట. వీరిలో చాలామందికి నీళ్లు, తిండి కూడా లభించని స్థితి. ప్రభుత్వం సహయా సిబ్బందిని ముందుగానే అప్రమత్తం చేయకపోవడంతో వచ్చిన ఇబ్బంఇ ఇది. సకాలంలో పడవలనూ సమకూర్చుకోలేకపోవడంతో వరద బాధితులను తరలించడం కూడా సాధ్యం కాలేదు. కానీ... చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బాబు ప్రభుత్వం ఆర్భాటమైతే బాగానే చేసింది.
వరదల్లాంటి విపత్కర పరిస్థితుల్లో గతంలో మాదిరిగా వలంటీర్ల వ్యవస్థ ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఇప్పుడు వరద ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వరదలొచ్చినప్పుడు వలంటీర్లు బాగా పని చేశారని ప్రజలు కొందరు గుర్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో లంకలు వరదకు గురైనప్పుడు వలంటీర్ల సేవలు అందరి ప్రశంసలు పొందిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. వరద ముప్పు గురించి ముందుగానే హెచ్చరించడం, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సకాలంలో ఆహారం, నీళ్లు అందించడం వంటివి వలంటీర్లు చక్కగా చేశారు.
అంతేకాదు.. గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది, తాలూకా కార్యలయ సిబ్బంది కూడా వలంటీర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా అన్ని జాగ్రత్తలూ తీసుకోగలిగారు కాబట్టి నష్టం, ఇబ్బందులు నామమాత్రమయ్యాయి. ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్ ఆదేశించిన రీతిలో పిల్లలు, పెద్దలందరికీ తగిన సాయం చేయడమే కాకుండా.. సహాయ శిబిరాల్లోంచి బాధితులు తిరిగి వెళ్లేటప్పుడు ఒకొక్కరికీ రూ.రెండు వేల రూపాయల నగదు కూడా అందించి పంపారు. వరద నష్టం తాలూకూ సమాచారం పూర్తిగా అందిన వెంటనే నష్టపరిహారం చెల్లింపు జరిగేలా ఏర్పాట్లు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చి పనులు చేయించారు. ఇవన్నీ పూర్తి అయ్యాక సీఎంగా జగన్ ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అన్ని అందాయా లేదా? అన్నది వాకబు చేసేవారు. అంతేకానీ.. వరదల సమయంలోనే వెళ్లి హడావుడి చేసి అధికారుల విధులకు ఆటంకం కలిగించలేదు.
కాని చంద్రబాబు స్టైల్ అందుకు భిన్నం. ఇప్పటికే వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. ఫలితంగా ఎక్కడ ఏమి జరుగుతోందో అధికారులకు తెలియజేసే అప్రమత్తం చేసే వ్యవస్థ లేకుండా పోయింది. ప్రజలకు తగు సమాచారం ఇచ్చేవారు లేరు. బుడమేరు వరద కట్ట తెగుతుంటే అధికారులు చర్యలు తీసుకోని దైన్యస్థితి. స్థానికులు కొందరు ఆయా ఆఫీస్ లకు పోన్ చేసినా పలికే నాధుడు లేకుండా పోయాడని పలువురు వాపోయారు. పడవలు అరకొర ఏర్పాటు చేసినా ,మెయిన్ రోడ్డులోని వరద నీటిలోనే అవి తిరగాయట. అందులోనూ సిఫారస్ ల మేరకే తరలింపులు సాగాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ప్రైవేటు బోట్లు మాత్రం వరదలను అడ్డుపెట్టుకుని దందా చేశాయట. చేయవలసిన పనులు చేయకుండా ,ప్రజలు నడుం లోతు నీటిలో ఉన్నప్పుడు సీఎం స్థాయి వ్యక్తో, మంత్రులో బోట్లలో తిరుగుతూ తాము చాలా బాధ పడుతున్నామని చెబితే ఏంటి ప్రయోజనం? చేయగలిగినవాటిని చేసిన తర్వాత, అప్పటికీ ఏవైనా చేయలేకపోతే జనం అర్థం చేసుకుంటారు. అంతే తప్ప, అర్ధరాత్రి వచ్చా, మధ్యాహ్నం వచ్చా అని నేతలు చెబితే జనం ..అయితే ఏంటట? అని మాత్రమే అనుకుంటారు. తమకు ఏమి ఒరిగిందని అడుగుతారు.
ముంబై నటి, మాయలేడి కాదంబరి జత్వానీని పనికట్టుకుని తీసుకువచ్చి కొందరు ఐపిఎస్లపై కేసులు పెట్టడానికి చూపిన శ్రద్ద వరద బాధితులపై చూప లేదు. అమరావతి రాజధాని ప్రాంత అంతా మునిగిపోయిందని మీడియాలో వార్తలు వస్తే చంద్రబాబు ఊరుకోరట. అది దుష్ప్రచారమని ఆయన దబాయిస్తున్నారు. రాజధాని స్మశానం కావాలనుకునేవారే మునిగి పోయిందని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అనడం ఎంత దారుణం! ఎవరు అలా కోరుకుంటారు! ఒక పక్క మొత్తం రాజధాని ప్రాంతం అంతా వరద నీటిలో తేలియాడుతుంటే, అదేమి జరగలేదని బుకాయిస్తే జనానికి వాస్తవ పరిస్థితి తెలియదా!.
ఇవన్నీ ఎందుకు..? అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించి అసలు వరద నీరే లేదని మీడియాకు చెప్పగలరా! హైకోర్టులోకి నీరు ఎలా వచ్చిందో వివరించగలరా!సోమవారం హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు ఆన్ లైన్ లోనే పని చేయడానికి ఏర్పాటు చేసుకున్నది అవాస్తవమా! తన కరకట్ట ఇంటిలోకి నీరు రాలేదని, నది ఒడ్డున ఇసుక బస్తాలు వేసి నీరు రాకుండా ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదని మీడియాకు చెబుతారా? అసలు అక్కడకు మీడియాకు ఎందుకు అనుమతించలేదు? ఆయన ఇంటికి ఇసుక లారీలు ఎందుకు వెళ్లాయి? గతంలో ఓటుకు నోటు కేసు సమయంలో కూడా రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోయి, ప్రజల కోసమే తాను మకాం మార్చానని చెప్పుకున్న చరిత్ర బాబుది. ఇప్పుడు కూడా జనం కోసమే విజయవాడలోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద బస చేస్తున్నానని మీడియాలో వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వం వల్ల బుడమేరు కట్ట తెగిందని చంద్రబాబు ఆరోపించారు తప్ప, గేట్లు ఎందుకు ఆకస్మికంగా ఎత్తి వేసింది వివరించలేదు. అంతేకాక ఒక ప్రైవేటు హైడల్ ప్లాంట్‌కు గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఫలితంగానే డైవర్షన్ కాల్వ ద్వారా కృష్ణలోకి నీరు వేగంగా వెళ్లడం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.అది వాస్తవమా? కాదా?అమరావతి రాజధాని ప్రాంతం మూడు పంటలు పండే ప్రాంతాన్ని విధ్వంసం చేసి భవంతులు కట్టాలని తలపెట్టడం వల్లే సమస్యలు రావడం లేదా? అదే నాగార్జున యూనివర్శిటీ సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఈ భవనాలు నిర్మించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవా? శివరామకృష్ణ కమిటీ కూడా పంటలు పండే భూమిలో రాజధాని నిర్మాణం వద్దని చెప్పిందా? లేదా?.
తాను చాలా విజనరీని అని ఆయనకు ఆయనే ప్రచారం చేసుకుంటారు కదా! అంత పెద్ద దార్శనికుడు అయితే విజయవాడలో కృష్ణానది వరదల వల్ల తరచుగా దెబ్బతింటున్న కృష్ణలంక తదితర ప్రాంతాల వారిని రక్షించడానికి అవసరమైన గోడను తన పద్నాలుగేళ్ల పాలనలో ఎందుకు చంద్రబాబు కట్టలేకపోయారు? జగన్ ఐదేళ్లలోనే నిర్మించి చూపించారు కదా! దానివల్లే ఇప్పుడు ఆ ప్రాంతం వరద బారిన పడకుండా ఉందా? లేదా? దీనిని అంగీకరించడానికి మనసు రాని చంద్రబాబు గత ప్రభుత్వంపై బురద చల్లడం సరైనదేనా?.ఇలా ఆయా ప్రశ్నలకు చంద్రబాబు నుంచి వచ్చేది దబాయింపు, బుకాయింపే!!.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment