Kommineni Srinivasa Rao Analysis Of Pawan Kalyan Politics Over His Comments On Volunteers - Sakshi
Sakshi News home page

పవన్‌ ఇంతకీ ఏం సాధించినట్లు?.. పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో!

Published Fri, Jul 14 2023 9:39 AM | Last Updated on Fri, Jul 14 2023 10:56 AM

Kommineni Srinivasa Rao Analysis Of Pawan Kalyan Politics - Sakshi

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతకీ ఏమి సాధించినట్లు? ఏపీలో గౌరవ వేతనం తీసుకుంటూ స్వచ్చందంగా పనిచేస్తున్న లక్షలాది మంది వలంటీర్లను అవమానించడం ఎందుకు, ఆ తర్వాత భంగపడడం ఎందుకు, మళ్లీ దిక్కుమాలిన వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్దం చేయడం, ఆయన బొమ్మను చెప్పులతో కొట్టడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒక వ్యవస్థను ఇంత ఘోరంగా అవమానించి పవన్ మూటకట్టుకున్నది ఏమిటంటే జనంతో తిట్లు. ధైర్యం ఉంటే పవన్ కల్యాణ్ తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే ఈ వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పగలగాలి.

వృద్దులకు ఇళ్ల వద్దకు పెన్షన్‌లు ఇవ్వడానికి వీలు లేదని స్పష్టం చేయాలి. వృద్దులంతా ఎప్పటి మాదిరే తాలూకా ఆఫీస్‌ల వద్ద పడిగాపులు పడినా తప్పు లేదని పవన్ కల్యాణ్ ప్రకటించాలి. ఆయన తన ప్యూడల్ లక్షణాలను, సినిమాలలో ఉండే ఆధిపత్య మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. తాలూకా అధికారులు ఉండగా వలంటీర్లు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. వలంటీర్లు లేనప్పుడు ప్రజలు తమ పనులకు ఎంత కష్టపడేవారో పవన్‌కు ఏమి తెలుసు. మొహానికి రంగు పూసుకుని,  డైరెక్టర్ చెప్పినట్లు ఆడే వ్యక్తికి ప్రజలు కష్టాలు ఏమి తెలుసునని గతంలో ఎన్.టి.రామారావును ఉద్దేశించి ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేవారు.

ఎన్టీఆర్‌ నటనతో పాటు ప్రజల కష్టాలలో పాలుపంచుకున్నారు కాబట్టి ఆయన రాజకీయాలలో కూడా చాలా వరకు, కనీసం తన అల్లుడు, కుమారుల చేతిలో చావుదెబ్బ తినేవరకు అయినా సఫలం అయ్యారు. రాయలసీమలో కరువు వచ్చినా, కోస్తాలో తుపానులు, వరదలు వచ్చినా ఆ రోజుల్లో ఎన్టీఆర్‌, ఎ.ఎన్ ఆర్. తదితర ప్రముఖ నటులంతా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చేవారు. పవన్ కల్యాణ్‌కు ఆ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. ఆయన సినిమాలలోకి వచ్చాక విలాస పురుషుడుగా మారారు కనుక సామాన్యుల వెతలు ఎలా తెలుస్తాయి. కాకపోతే అన్నీ తనకు తెలుసు అన్నట్లు పోజ్ ఇస్తుంటారు.
చదవండి: వలంటీర్ల వ్యవస్థ రద్దు కోసమే కుట్ర

ఎవరో రాసిచ్చిన కాగితాలను ఆలోచించకుండా చదవడానికి అలవాటు పడ్డారు. అందుకే వలంటీర్ల మీద అలా విషం కక్కారు. ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబుల ఎజెండా ప్రకారం పనిచేస్తున్నారు తప్ప ప్రజల ఎజెండా కోసం కాదని పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. తాజాగా వలంటీర్ల వ్యవస్థ నడుం విరగగొడతానని ఆయన అన్నారట. అంటే ఏమిటో కూడా స్పష్టత ఇవ్వాలి. మొత్తం రద్దు చేస్తామని చెబుతున్నారా? లేక ఇప్పుడు ఉన్నవారిని తొలగిస్తారా ? ఏమిటో ఆయన ఏదో ఒకటి మాట్లాడడం, మీడియాలో అదో పెద్ద వార్త కావడం మామూలైపోయింది. అవన్ని చూస్తే ఈయన రాజకీయాలకు ఎందుకు పనికి వస్తారా? అన్న ప్రశ్న ఎదురవుతుంది.

గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు అనుబంధంగా ప్రజలకు అవసరమైన వివిధ సర్టిఫికెట్లు కూడా వలంటీర్ల ద్వారా ప్రజలు తేలికగా పొందగలుగుతున్నారన్న విషయం పవన్‌కు తెలిసి ఉంటే ఇంత ఛండాలంగా మాట్లాడతారా?. తొలుత వలంటీర్ల సమాచార సేకరణ ద్వారా మహిళల అక్రమరవాణా అంటూ అజ్ఞానంగా మాట్లాడి అందరి ఆగ్రహానికి గురి అయ్యారు. తర్వాత నాలుక కరుచుకుని అబ్బే తాను అందరు వలంటీర్లను అనడం లేదని సరిచేసుకోవాలని ప్రయత్నిస్తూనే, మళ్లీ బురద చల్లారు.

అసలు ఆ వ్యవస్థ వల్ల లాభం లేదని పవన్ కల్యాణ్ నమ్మితే నిజాయితీగా అదే విషయం చెప్పాలి. అదే కాదు.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను తీసివేస్తామని ధైర్యంగా పవన్ తన మానిఫెస్టోలో పేర్కొనాలి. అప్పుడు ఆయనకు ఒక విధానం ఉంటుందని అనుకోవచ్చు. అది ప్రజలకు నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. తానింతే అని ఆయన అనవచ్చు. గ్రామ,వార్డు సచివాలయాలు ఎందుకు అంటూ మళ్లీ తనకు తోచిన విధంగా పండితుడి మాదిరి మాట్లాడి కొత్త వివాదంలోకి వెళ్లారు.
చదవండి: పవన్‌ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని..

పిచ్చి పీక్ కు వెళ్లడం అంటే ఇదేనేమో! పవన్ తాను ఓడిపోతాను అని తెలిసి కూడా జనంలోతిరుగుతున్నానని చెప్పడం లేదా? అలాగే ప్రజలకు ఉపయోగపడే ఆయా వ్యవస్థలను తొలగించి రాజకీయం చేస్తానని, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండవలసిన అవసరం లేదని పవన్ అంటే. జనం స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా! వీటితో పాటు జగన్ పని, పాట లేకుండా అందరికి అందుబాటులో ఉండేలా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని, కుటుంబ డాక్టర్ విధానం ప్రవేశ పెట్టి ఇళ్లకు వైద్యులను పంపడం ఏమిటని పవన్ ప్రశ్నించాలి. జగన్ ప్రభుత్వ విదానం పేదలకు అనుకూలంగా ఉండడం, పేద, మధ్య తరగతి, ధనిక అన్న తేడా లేకుండా అన్ని సేవలను అందుబాటులో ఉంచడం అయితే. మరి పవన్ కళ్యాణ్ విధానం పెత్తందారులకు అండగా నిలబడడం అన్నమాట.

ఎటూ ఇలాంటివి సినిమాలలో అలవాటే కదా! జూనియర్ ఆర్టిస్టులకు, ఇతరత్రా దినసరి కళాకారులకు అంతంత మాత్రంగా అందే వేతనాలను పెంచాలనో, వారికి సదుపాయాలు కల్పించాలనో ఎన్నడైనా పవన్ కళ్యాణ్ కోరారా? లేదు కదా? అందుకే ఆయనది పెత్తందారి భావజాలం. పైకి చెగువేరా అనో, శ్రీశ్రీ అనో కబుర్లు చెప్పినా ,ఇప్పుడు ఆయన వ్యక్తపరుస్తున్న ఆలోచనల ధ్వారా ఆయన ఏ క్లాస్ మనిషో ప్రజలందరికి అర్ధం అయింది.జగన్ క్లాస్ వార్ అంటే చొక్కా చించుకున్న పంన్ కళ్యాణ్ ఆచరణలో మాత్రం పెత్తందార్ల ప్రతినిధిగానే మాట్లాడారు. వలంటీర్లకు ఐదువేల రూపాయల జీతమా? వారికి వేరే ఉద్యోగాలు ఇవ్వరా అని అమాయకంగా ప్రశ్నించారు.

పోనీ తాను అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఏభై వేలు ఇస్తానని చెప్పవచ్చు కదా? ఇంతకీ వలంటీర్ల నడుం విరగగొడతారా? లేక వారికి జీతాలు పెంచాలంటారా? అంతా గందరగోళమే.  గత చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలలో టీడీపీ కార్యకర్తలు, నేతలు అరాచకాలకు పాల్పడితే ఎన్నడైనా పవన్ కళ్యాణ్ నోరు తెరిచారా? బెల్లం కొట్టిన రాయి మాదిరి వ్యవహరించిన ఆయన ఇప్పుడు పనిచేస్తున్న వలంటీర్లపై మాత్రం లేనిపోని నిందలు వేశారు నేరుగా నగదు పంపిణీ ద్వారా అవినీతికి తావు లేకుండా స్కీములు అమలు చేస్తుంటే, పవన్ వాటన్నిటిని రద్దు చేస్తానని అంటున్నారు.

వీర మహిళలు అంటూ ప్రసంగాలు చేసే ఆయన లైంగిక వేధింపులపై ఏనాడైనా పోరాడారా? అంటే అదీ లేదు. టిడిపి హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ అంత పెద్ద ఎత్తున జరిగితే పవన్ ఎందుకు మౌనంగా కూర్చుండి పోయారు. తన భార్యను కూడా తిట్టారని అచ్చం చంద్రబాబు మాదిరి కొత్త ఆరోపణ చేశారు. నిజానికి ఆయన భార్యను ఎవరూ ఏమీ అనలేదు. అయినా ఆయన తన దిక్కుమాలిన రాజకీయం కోసం ఆమెను కూడా లాక్కురావడానికి వెనుకాడలేదనుకోవాలి. అదే సమయంలో ఆమెతో తనకు బంధం ఉందని, ఎక్కడా తెగిపోలేదని, తనపై తప్పుడు ప్రచారం చేశారని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పడం లేదో తెలియదు.

వారాహి యాత్ర రెండో దశ పూజలు భార్యతో కలిసి చేశారని జనసేన ప్రకటించింది కాని, ఆ పూజల పోటోలు కాకుండా , ఇద్దరు నిలబడి పోజులిచ్చిన ఎప్పటి ఫొటోనో ఎందుకు పెట్టారో చెప్పడం లేదని పలు యూట్యూబ్ చానళ్లు ప్రశ్నించాయి. వాటికోసం అయినా ఆయన వాస్తవం ఏమిటో చెబితే ముఖ్యమంత్రి జగన్ చేసిన నాలుగు పెళ్లిళ్ల వ్యంగ్య వ్యాఖ్యలకు కూడా సమాధానం ఇచ్చినట్లు అయ్యేది కదా? శ్రీరంగ నీతులు చెప్పడం కాదు.. ఆచరించి చూపితేనే దానికి విలువ ఉంటుంది.ఇప్పటికీ ఎవరో కేంద్ర నిఘా అధికారి ఎప్పు డో మహిళల అక్రమ రవాణా గురించి చెప్పారని పవన్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.

చంద్రబాబు నాయుడు కనీసం అతికినట్లు అబద్దం ఆడడానికి ప్రయత్నిస్తారు. ఆయనకు దత్తపుత్రుడన్న పేరు తెచ్చుకున్న ఈయన మాత్రం ఆ విషయంలో వెనుకబడిపోయారు. కులాన్ని ఇంత బహిరంగంగా వాడుకుంటున్న నేత కూడా ఈయనే అనిపిస్తుంది. పైకి కులాలేమిటి అంటూనే కనీసం కాపులైనా తనకు మద్దతు ఇవ్వరా అని ప్రశ్నించిన ఏకైక కుల నేత పవన్ కళ్యాణ్ అంటే ఆశ్చర్యం కాదు. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కనుక కాసేపు వినోదం చూసినట్లు ఉంటుందని జనం వస్తే రావచ్చు. సినిమా అయిపోయిన తర్వాత దానిని ప్రజలు ఎలా పట్టించుకోరో, పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే.

పవన్ కల్యాణ్‌ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలలో ఏదో నాలుగు ఓట్లు రాల్చుకోవచ్చని ఆశించిన చంద్రబాబు నాయుడుకు కూడా ఈ పరిణామం తీవ్ర ఆశాభంగమే కలిగించవచ్చు. ఏదో కొద్దిగా నటించమంటే మరీ అతి చేసి అసలుకు మోసం వచ్చేలా చేశాడని చంద్రబాబు ఆవేదన చెందుతుండవచ్చు. అయినా ఆయనకు నోరు ఎత్తలేని పరిస్థితి. అటు పవన్ కళ్యాణ్‌ను ఏమి అనలేక, ఇటు వలంటీర్ల ఆగ్రహం ఎలా పరిణమిస్తుందో తెలియక చంద్రబాబు సతమతమవుతుండాలి. పవన్ కళ్యాణ్ యుద్దం చేస్తానని అంటుంటే ఏదో ముఖ్యమంత్రి సీటుకోసం పోరాడుతారని ఆయన అభిమానులు అనుకుంటుంటే, ఆయన మాత్రం వలంటీర్లతో గొడవ పెట్టుకుని తన స్థాయిని దిగజార్చుకున్నారు.

చివరికి వలంటీర్లే తనను ఓడిస్తారేమోనని భయపడే పరిస్థితికి పవన్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వంటివారు ఇంకా అనరాని మాటలు అనవచ్చు. అయినా వలంటీర్లు మనో నిబ్బరం వీడకుండా ప్రజలకు సేవచేసి మంచి పేరు తెచ్చుకోవాలి. తాను వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు కరెక్టు కాబట్టే అంతగా నిరసనలు వచ్చాయని పవన్ అనడం మరీ చిత్రంగా ఉంది.ఎవరైనా బట్టలూడదీసుకుని తిరుగుతుంటే కనిపించినవారల్లా ఇదేమి పని అని ఆగ్రహం చెందుతారు. కాని అదే తనకు స్పందన అని బట్టలు లేకుండా తిరిగే వ్యక్తి అనుకుంటే ఎవరైనా ఏమి చేస్తారు? ఇక పొత్తులపై పవన్ మాట్లాడిన తీరు కూడా గమ్మత్తుగా ఉంది.

టీడీపీని ఒక్క మాట అనకుండా, వారితో అంటకాగుతాననే సంకేతాలు ఇస్తూనే, మరో వైపు పొత్తుల గురించి జనసేన నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఆయన హెచ్చరించడం ఆ పార్టీలో ఉన్న గందరగోళానికి మరో నిదర్శనంగా ఉంది. ఒకసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, మరోసారి తాను సి.ఎమ్. పదవికి పనికి రానని, ఇలా ఏవేవో మాట్లాడుతూ వచ్చిన పవన్ తాజాగా పొత్తులపై మళ్లీ తూచ్.. రహస్యం అని అనడం కూడా ఆ పార్టీ కార్యకర్తలలో అయోమయం ఏర్పడింది. వలంటీర్ల సంగతి అలా ఉంచితే జనసేన పొత్తులపై ఒక క్లారిటీ ఇస్తే ఆ పార్టీకి మంచిదే. టీడీపీ డైరెక్షన్ మేరకే ఆయన మళ్లీ మాట మార్చినట్లు నటిస్తున్నారా అన్న సందేహం కూడా వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలలోకి ఎందుకు వచ్చారో, ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా ఉందంటే ఆశ్చర్యం కాదు.


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement