ఈనాడు మీడియా రోజురోజుకు రెచ్చిపోతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై కక్షకట్టి నిత్యం అబద్దాల వంట చేసి పాఠకులకు వడ్డిస్తోంది. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి తదితర ఎల్లోమీడియా పోటీ పడుతున్నా, ఈనాడు రామోజీరావు వారందరిని మించిపోయి నడరోడ్డులో బట్టలు ఊడదీసుకుని తిరగుతున్నట్లు రాస్తున్నారు. అడ్వర్టైజ్‌మెంట్‌లతో సంబంధం లేకుండా ఏపీలో పేజీలు పెంచి మరీ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కృషి చేస్తున్నారు. అంటే కోట్ల వ్యయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నమాట.
ప్రభుత్వంపై బురద చల్లడానికి కోట్లు
గతంలో టీడీపీ చేసిన వాదన ప్రకారం ఇదంతా టీడీపీ ఎన్నికల ఖర్చులో భాగంగా రాయాలి. గతంలో ఏదైనా ఒక చిన్న వార్త అనవసరంగా రాస్తున్నారని రామోజీరావు భావిస్తే, సెంటిమీటర్ల చొప్పున ఖరీదు లెక్కవేసి అంత సొమ్ము వృథా చేశారని జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అలాంటి రామోజీరావు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు.. బహుశా ఇప్పటికే ఈ ఏడాదికాలంలోనే ఒక వంద కోట్ల రూపాయల విలువైన స్పేస్‌ను వైస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లడానికి, టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి వెచ్చించి ఉండవచ్చు. అంటే ఆ మేరకు ప్రచార ప్రకటనలు వదలుకుని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు ఇచ్చారన్నమాట.
సమ్మె ఆరంభించారని తప్పుడు కథనం
రామోజీకి తెలుగుదేశం పార్టీతో ఎంత ప్రయోజనం లేకపోతే ఇంతగా ఖర్చు చేస్తారు? ఏపీలోని వివిద వర్గాలను రెచ్చగొట్టడానికి ఈనాడు మీడియా ఎంత నీచంగా పనిచేస్తోందో చూడండి. ఏపీలో కొద్ది మంది వలంటీర్లు తమ గౌరవ వేతనం పెంచాలని అడిగారట. అంతే! వారు సమ్మె ఆరంభించారని తప్పుడు వార్తను ఇచ్చేసింది. దాంతో మొత్తం వలంటీర్ల వ్యవస్థ స్తంభించినట్లు కలరింగ్ ఇచ్చే యత్నం చేసింది. గతంలో నిరుద్యోగులకు నెలకు రెండువేల రూపాయల చొప్పున భృతి ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లపాటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఏదో మమ అనిపించారు తప్పితే సజావుగా అమలు చేయలేదు. అయినా చంద్రబాబును విజనరీగా ఈ మీడియా ప్రచారం చేసింది.
వలంటీర్లపై నానా రచ్చ
అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది యువత, మద్య వయసు వారిని ఎంపిక చేసి వారికి నెలకు అయిదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వారితోటి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. అది చూసి కన్నుకుట్టిన ఈనాడు మీడియా, తెలుగుదేశం, జనసేన అధినేతలకు వలంటీర్లపై నానా రచ్చ చేశాయి. వారికి రకరకాల అవలక్షణాలను అంటగట్టారు. వారందరూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలని ప్రచారం చేశారు. వలంటీర్లు పురుషులు ఇళ్లలో లేనప్పుడు వెళ్లి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని నీచమైన ఆరోపణ చేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదు.
స్వరం మార్చిన ఈనాడు
ఆయనకు తగినట్లే పవన్ కల్యాణ్ అదే రీతిలో పిచ్చి అభియోగాలు చేశారు. ఈ వలంటీర్ల ద్వారా టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారని కూడా ప్రచారం చేశారు. ఇంత చేసిన ఈనాడు మీడియా ఇప్పుడు స్వరం మార్చి వలంటీర్లను ఎలా రెచ్చగొట్టాలా అని చూస్తోంది. అందుకే ఎవరో కొందరు వలంటీర్లు మండల అధికారులకు తమ వేతనం 18 వేలు చేయాలని వినతిపత్రాలు ఇస్తే అదే బానర్ కథనం అయిన చందంగా ఈనాడు రాసిందంటే వారి దురుద్దేశం అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్లపై ఈనాడు మీడియాకు ప్రేమ ఉన్నట్లు, సానుభూతి ఒలకపోస్తూ గొప్పగా నటిస్తోంది.
విష ప్రచారం
మొన్నటిదాకా ఎక్కడైనా వలంటీర్ చిన్న తప్పుచేస్తే గోరంతను కొండంతగా ఈనాడు మీడియా విష ప్రచారం చేసింది. ఆ సంగతి మర్చిపోకూడదు. వలంటీర్ అన్నది ఉద్యోగం కాదు. వారికి ఏదైనా మంచి అవకాశం వస్తే వలంటీర్ బాధ్యతను వదలి వెళ్లిపోవచ్చు. అయినా వారు ఏవైనా కోరికలు ఉంటే అడగడవచ్చు. కాని అవి హేతుబద్దంగా లేకపోతే వారికే నష్టం. ఏదో ఈనాడు వారో, లేక టీడీపీనో, జనసేనో, మరో పార్టీనో వారిమీద కపట ప్రేమ కనబరిస్తే వారిని నమ్ముతారా?
వలంటీర్లను టీడీపీ కొనసాగిస్తుందా?
వలంటీర్లు ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి. తెలుగుదేశం, జనసేనలు తమ ఎన్నికల మానిఫెస్టోలో వలంటీర్లు అడుగుతున్న మేర వేతనం ఇస్తామని, వారి ఇతర డిమాండ్లు అంగీకరిస్తామని చెప్పించగలరా? అసలు వలంటీర్లను టీడీపీ కొనసాగిస్తుందా? కొనసాగించినా ఇప్పుడు ఉన్నవారిని అలాగే ఉంచుతుందా? వీటన్నిటి గురించి కూడా వలంటీర్లు ఆలోచించకపోతే వారికే నష్టం. నిజానికి వలంటీర్లు చాలా కొద్ది మాత్రమే వీరి ట్రాప్‌లో పడ్డారు. అందువల్ల ఇది సీరియస్ అంశం కాలేదు. కాకపోతే జరుగుతున్న కుట్రలను అంతా గమనించాలని చెప్పక తప్పదు. అంత దాకా ఎందుకు ఈనాడు రామోజీరావు తన సంస్థలలో కిందిస్థాయి ఉద్యోగులకు ఎంత వేతనం ఇస్తున్నారో తెలుసుకోండి.
తప్పుదారి పట్టించే యత్నం
రామోజీ పిలిం సిటీలో ఎంత చొప్పున జీతాలు ఇస్తున్నారో గమనించండి. నిజంగానే అక్కడ వలంటీర్ స్థాయి ఉద్యోగులకు కూడా ఇరవై వేలు, ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారేమో తెలుసుకోండి. కరోనా సమయంలో ఎంతమంది ఉద్యోగులకు పూర్తి నెల జీతం ఇచ్చారో అడగండి. కాని అదే ఈనాడు మీడియా, ప్రభుత్వం కరోనా సంక్షోభంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో కొంత ఆలస్యం అయితే వారికన్నా ఎక్కువ గగ్గోలు పెట్టింది. అలాగే పురపాలక సంఘాలలో పనిచేసే కార్మికులను రెచ్చగొట్టి ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కమ్యూనిస్టు నేతలు ప్రయత్నిస్తున్నారు. వారికి వాస్తవ పరిస్థితి తెలుసు. కానీ ఎన్నికల స్వార్ధం కోసం కమ్యూనిస్టు నేతలు కొందరు అమాయక కార్మికులను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు.
ఎన్నడైనా మొదటి పేజీలో ప్రచురించిందా?
ఈనాడు తదితర ఎల్లో మీడియా వారికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. వారి డిమాండ్లను, వారి ఆవేదన అంటూ మొదటి పేజీలో ప్రచురించిందంటేనే ప్రజలను మోసం చేయడమే లక్ష్యమని అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు కాలంలో ఇలాంటి డిమాండ్లను ఈనాడు ఎన్నడైనా మొదటి పేజీలో ప్రచురించిందా? అలాగే అగన్ వాడీలను రెచ్చగొట్టి వారితో సమ్మె చేయిస్తున్నారు.ని జానికి జగన్ ప్రభుత్వం వచ్చాక వారికి సంబంధించిన అనేక కోర్కెలను ప్రభుత్వం తీర్చింది. వేతనాలు పెంచింది. ఇతరత్రా సదుపాయాలు ఇచ్చింది. అయినా ఇప్పుడు ఎన్నికల సమయంలో వారి వేతనం 26వేలు చేయాలంటూ ఆచరణ సాద్యం కాని డిమాండ్‌లను సీపీఎం అనుబంధ యూనియన్ పెట్టి, అంగన్ వాడి కార్యకర్తలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో వేతనం తెలుసుకోండి
వేతనం ఒక్కసారి సీపీఎం పాలిత కేరళ రాష్ట్రంలో అంగన్ వాడీలకు కాని, పురపాలక సంఘాలలో పనిచేసే వర్కర్‌లకు కానీ ఎంత వేతనం ఇస్తున్నారో తెలుసుకోండి. లేదా ఇతర రాష్ట్రాలలో వీరికి ఎలా చెల్లిస్తున్నారో గమనించండి. అప్పుడు సమంజసమైన రీతిలో అడగవచ్చు. అలా కాకుండా ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో ఉన్న రాజకీయపార్టీల ట్రాప్‌లో పడడం సరికాదు. దానివల్ల వారికే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ అంగన్ వాడి కార్యకర్తలు, పురపాలక సంఘాలలోని కార్మికులు, వలంటీర్లు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. వారికి వచ్చే వేతనంతో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్కీములలో కూడా వీరిలో చాలామంది లబ్ది పొందుతుండవచ్చు.
ఎల్లో మీడియా తప్పుడు మాటలు నమ్మి మోసపోతే అంతే..
పలువురికి అమ్మ ఒడి ద్వారా పదిహేను వేల రూపాయల చొప్పున పొందుతుండవచ్చు. వారి పిల్లలు ఆంగ్ల మీడియంలో చదువుకునే అవకాశం కల్పించారు. వారికి టాబ్‌లు కూడా ఇస్తున్నారు. ఇలా వివిధ స్కీముల కింద వీరు కూడా లబ్ది పొందుతున్నారు. ప్రతిపక్షాలు, ఈనాడు ,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తప్పుడు మాటలు నమ్మి మోసపోతే తాము కూర్చున్న చెట్టుకొమ్మను వారే నరుకున్నవారయ్యే ప్రమాదం ఉంది.ఈ ప్రతిపక్షాలకు, ఈనాడు రామోజీరావు తదితరులందరికి ఒకటే లక్ష్యం అది పేదలను ఆదుకుంటున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం. ఈ నేపథ్యంలో పెత్తందారుల కుట్రలలో అంగన్ వాడీలు, పురపాలక సంఘాల కార్మికులు, కొద్ది మంది వలంటీర్లు పావులవుతారా? తమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉంటారా అన్నది వారే తేల్చుకోవాలి!.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment