
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట మార్చడం దిట్ట.. తన అవసరాలకు తగ్గట్టుగా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అంశాలలో మాట మార్చుతుంటారు. చివరికి అవినీతి వ్యవహారాలలో కూడా అదే ప్రకారం నాలుక మడతేశారు. 2018 నవంబర్‌లో పవన్ కళ్యాణ్ ఏపీలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. ‘అనుభవం ఉందని, 2014 ఎన్నికలలో ఆయనకు మద్దతు ఇచ్చి అధికారంలోకి తీసుకు వచ్చానని, కానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతికి బాటలు వేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు’ అని విమర్శించారు.
✍️ కాంగ్రెస్ కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారని కూడా ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి తవ్వే కొద్దీ పుంఖానుపుంఖాలుగా అవినీతి కథలు వస్తాయని పవన్ అప్పట్లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చూస్తే ఏమనిపిస్తుంది. నిజంగానే పవన్ కళ్యాణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడతారని అనిపిస్తుంది. చంద్రబాబు అవినీతిని ఎక్కడా సమర్ధించరనిపిస్తుంది. కానీ, అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడేమంటున్నారో చూడండి..‘శాసనసభలో నిర్ణయం తీసుకుని అమలు చేస్తే చంద్రబాబును జైలుకు పంపుతారా? చంద్రబాబుకు కచ్చితంగా నా మద్దతు ఉంటుంది’ అని ఆయన చెబుతున్నారు. దీనిని మాట మార్చడం అంటారా? అనరా?.
✍️చంద్రబాబు అరెస్టు అయిన రోజున పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి గమనిస్తే వారి బంధం ఫెవికాల్ మాదిరి ఇలా అతుక్కుపోయిందా అనిపిస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ జైలుకు వెళ్లిన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నానని చెప్పడం నిస్సుగ్గుగా మాట మార్చడమే అవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తారే కానీ, ఇంతకీ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారా? లేదా? అన్నదానిని మాత్రం చెప్పరు. స్కిల్ స్కామ్ పూర్వాపరాలు మాట్లాడి అందులో తప్పు, ఒప్పులను విశ్లేషిస్తే అది ఒక పద్దతి. కానీ, గంపగుత్తగా సపోర్టు చేయడానికి రంగంలోకి దిగిపోయారు. చిత్రం ఏమిటంటే బీజేపీ మిత్రపక్షం అని అంటారు. ఎన్డీయేలో భాగస్వామినని చెబుతారు. కానీ, బీజేపీతో కాకుండా టీడీపీతో స్నేహం చేస్తుంటారు.
బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీ బంద్‌కు మద్దతు ఇస్తారు. పవన్‌కు ఇంత బలహీనత ఎందుకు ఏర్పడింది?. సీఎం జగన్‌పై వ్యతిరేకత ఒక్కటే ఇంతగా వ్యతిరేకత ఏర్పడడానికి కారణం అయి ఉండకపోవచ్చు. దీనితో పాటు చంద్రబాబు నుంచి వచ్చే ఆర్ధిక సాయం బాగా పనిచేస్తుంటుందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుంటుంది. దానిని ఆయన నిజం చేస్తున్నారా? అన్న భావన కలుగుతుంది. సీఎం జగన్ గతంలో జైలుకు వెళ్లారు కనుక మిగిలినవారు కూడా జైలుకు వెళ్లాలని అనుకుంటారని ఆయన చెబుతున్నారు. దీనిని బట్టి ఏం అర్దం అవుతుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ గురించి ఈయనకు ఏమీ తెలియకపోయి ఉండాలి. లేదా తెలిసినా దానిని కప్పిపుచ్చుతూ చంద్రబాబుకు మద్దతు ఇస్తుండాలి.
✍️తద్వారా ఒకటి మాత్రం వాస్తవం. జనసేన పరువును ఆయనకు ఆయనే తీసివేసుకుంటున్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రత్యేక విమానంలో రావాలి?. విమానానికి అనుమతి లేదంటే రోడ్డు మార్గాన వచ్చి ఎందుకు గోల చేయాలి. జగ్గయ్యపేట సమీపంలో పోలీసులు ఆయన కాన్వాయ్‌ని నిలిపివేస్తే, రోడ్డు మీద పడి దొర్లడమేమిటి?. అదేదో సినిమా షూటింగ్ చేస్తున్నట్లు ఉంది తప్ప మరొకటి కాదు. ప్రజాసమస్యలకు సంబంధించి పవన్ ఏవైనా నిరసనలు చేపడితే ప్రజలలో కొంచెమైనా సానుభూతి వస్తుంది. అలాకాకుండా అవినీతికి మద్దతుగా రోడ్డు మీద పడుకుంటే ప్రజలలో మరింత పలుచన అవుతారు.
జనసేన కార్యకర్తలలో ఉన్న కొంచెం ఆత్మస్తైర్యం కూడా దెబ్బతింటుంది. వచ్చే ఎన్నికలలో ఛాన్స్ తీసుకోరట. రాష్ట్రానికి జగన్ ప్రమాదకారి అని, ఆయన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే ప్రధాన ఎజెండా అని ఆయన చెబుతున్నారు. అంటే ఆయన థియరీ ప్రకారం ప్రపంచానికి పవన్ కళ్యాణ్ ప్రమాదకారి అనే గాజువాక, భీమవరం నియోజకవర్గాల ప్రజలు ఆయనను ఓడించారన్నమాట. బీజేపీతో కాపురం చేస్తున్నా, టీడీపీతో సహజీవనం ఖాయమని ఆయన స్పష్టం చేసినట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ తన బలహీనతను తానే బయటపెట్టేసుకుంటున్నారు. కాకపోతే టీడీపీతో బేరసారాలు పెంచుకోవడానికి పవన్ ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. ఏభై సీట్లు అడుగుతున్న పవన్ మరో పాతిక సీట్లు అడుగుతారని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.
✍️తెలుగుదేశంతో కలిసి పనిచేస్తామని సంకేతం ఇవ్వడానికి ఈ అవకాశాన్ని వాడుకున్నారన్నమాట. విశాఖలో జనసేనకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు కనుక ఇప్పుడు ఆయనకు పవన్ మద్దతు ఇస్తున్నారట. ఏమైనా అర్దం ఉండే మాట్లాడుతున్నారా?. విశాఖ విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు కొందరు నానా బీభత్సం సృష్టిస్తే పోలీసులు చర్య తీసుకున్నారు. ఆ ఘటన జరిగాక చంద్రబాబు ప్రత్యేకంగా పవన్‌ను కలిశారు. అందుకు ప్రతిగా అవినీతి కేసులో చంద్రబాబుకు మద్దతు ఇస్తారట. ఇది వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంది. ఈయన ప్రధానితో మాట్లాడి సీఎం జగన్‌ను ఏదో చేస్తానని పగటి కలలు కంటున్నారు. ఆ క్రమంలో కోనసీమ వారాహియాత్రను దెబ్బతీయడానికి రెండువేల మంది కిరాయి సైన్యాన్ని దించారని కేంద్ర నిఘావర్గాలు పవన్‌కు తెలిపాయట. అంతేకాదు.. ఏభై మందిని చంపేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఇంతకన్నా అద్వాన్న ప్రకటన ఏమైనా ఉంటుందా?.
పవన్‌లో మెచ్యురిటీ లేదనడానికి మరో ఉదాహరణ అవసరమా?. ఈయన ఇలాంటి చెత్త మాటలు ప్రజలకు చెబుతున్నారంటే, దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా వార్తలుగా ఇస్తున్నాయంటే ఏమి చెబుతాం?. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని నాటి ప్రభుత్వంలో పోలీసులు తిడుతూ నానా అరాచకం చేశారు. అయినా నోరు విప్పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు అరెస్టును తప్పుపడుతున్నారు. చంద్రబాబు తన పుష్కరాల స్నానం షూటింగ్ తీయడం కోసం సామాన్య భక్తుల ఘాట్‌లో స్నానమాడి తద్వారా తొక్కిసలాటకు కారణమయ్యారు. ఆ ఘటనలో 29 మంది మరణించారు.
✍️గుంటూరు, కందుకూరులలో 11 మంది చంద్రబాబు సభలలో తొక్కిసలాటలో మరణించారు. వీటన్నింటి విషయంలో నోరు ఎత్తని పవన్ అవినీతి కేసులో మాత్రం చంద్రబాబుకు మద్దతుదారుగా మారిపోయి, ఆయన భజన చేస్తున్నారు. తెలుగుదేశంతో పొత్తు లేకపోతే తాను గెలవలేనన్న భావన వల్లే ఇలా చేస్తుండవచ్చు. లేదా చంద్రబాబు రాజకీయంగానో, ఇతరత్రానో మంచి ఆఫర్ ఇచ్చి ఉండవచ్చు. అందుకే ఎప్పటికీ చంద్రబాబుతోనే తాను ఉంటానని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన ప్రవర్తించిన తీరుకానీ, మాట్లాడిన వైనం కానీ.. ఇవన్ని కూడా పవన్ కళ్యాణ్‌ను రాజకీయాలలో పరిపక్వత లేని వ్యక్తిగా పదే పదే రుజువు చేస్తున్నాయి. అది కాకుంటే పవన్ తన స్వార్దం కోసం చంద్రబాబును మించిన అవకాశవాదం ప్రదర్శిస్తున్నారనుకోవాలి.
కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్