తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం, వాద ప్రతివాదాలు రసవత్తరంగానే ఉన్నాయి. వచ్చే ఐదేళ్లపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య ఎలాంటి పోటీ వాతావరణం ఉంటుందో ఈ చర్చలు తెలియచెప్పాయి. వీరిద్దరూ కొన్నిసార్లు ఆత్మరక్షణలో పడితే, మరికొన్నిసార్లు ఎదుటివారిపై దాడి చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సి ఉంది. కానీ, ఆయన ఆరోగ్య కారణాలు, రాజకీయ కారణాల రీత్యా ఎంత వరకు ఆ విషయంలో క్రియాశీలకంగా ఉంటారో తెలియదు. పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను విమర్శిస్తుంటే ఓపికగా వినే పరిస్థితి ఉంటుందా అన్నది డౌటు. గతంలో ఎన్టీ రామారావు అధికారం కోల్పోయిన తర్వాత 1989 నుంచి ఐదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప, మిగిలిన సభా వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు, కోటగిరి విద్యాధరరావు, మాధవరెడ్డి, రఘుమారెడ్డి వంటివారే పర్యవేక్షించుకునేవారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే మోస్తరుగా పేరుకు మాత్రం ప్రతిపక్ష నేతగా ఉంటూ కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి తదితర నేతలకు బాధ్యతలు అప్పగించవచ్చేమో చూడాలి.
కేసీఆర్ టీఆర్ఎస్‌ను ఆరంభించినప్పుడు రేవంత్ ఆ పార్టీలో ఒక కార్యకర్తే. కానీ, అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఆయన జీవితంలో అది గొప్ప విజయం. అలాగే కేసీఆర్ కూడా చిన్న స్థాయి నుంచే రాజకీయ జీవితం ఆరంభించినా 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెనుదిరగలేదు. 2001లో టీఆర్ఎస్‌ను స్థాపించిన తర్వాత కేసీఆర్ అత్యంత కీలకనేతగా ఎదిగి, తెలంగాణ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియగా మారి తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి అయి తొమ్మిదిన్నరేళ్లు ఎదురులేకుండా పాలన సాగించారు.
కేసీఆర్ పాలనలోని తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ ఎండగడుతోంది. అందులోనూ రేవంత్ సంగతి చెప్పనవసరం లేదు. మామూలుగానే కేసీఆర్‌పై విరుచుకుపడుతుండేవారు. అలాంటిది సీఎం అయిన తర్వాత ఊరుకుంటారా?. వాటిని విని ఎదుర్కునే పరిస్థితి కేసీఆర్‌కు ఉంటుందా?. అలా ఉంటే మాత్రం శాసనసభ మరింత రంజుగా ఉంటుంది. శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత జరిగిన తొలి శాసనసభ సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన తీరు ఆ పార్టీకి కాస్త ఊపిరి ఇచ్చిందని చెప్పాలి. ఓటమి బాధలో ఉన్న కేడర్‌కు కొంత విశ్వాసం సమకూర్చిందని ఒప్పుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడేవారో, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అదే స్థైర్యంతో వ్యవహరించారు. మాటకుమాట బదులు ఇవ్వడంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాకపోతే కుటుంబపాలన అన్న పాయింట్‌లో కానీ,కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం విషయంలో కానీ కొంత ఇబ్బంది పడుతున్నారు.
బీఆర్ఎస్‌కు ఈ పాయింట్లు ఎప్పటికీ కష్టంగానే ఉంటాయి. రేవంత్ తనకు సభలోకానీ, బయట కానీ, ప్రతిపక్షం నుంచి సమస్య వస్తుందని అనగానే వీటిని రేకెత్తిస్తుంటారు. కుటుంబ పాలన విషయంలో కాంగ్రెస్ కూడా తీసిపోయిందేమి కాదు. అందుకే ఏడో గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన అందిస్తామని వాగ్దానం చేస్తున్నామని ప్రకటించారు. ఈ విషయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కున్నారు. సాధారణ ప్రజలనే కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలవకుండా కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరించారన్న విమర్శ ఉన్న మాట నిజమే. దానిని రేవంత్ ప్రస్తావించి కేసీఆర్ ఇంటి వద్ద ఆనాటి హోం మంత్రి మహమూద్ అలీని హోం గార్డు నిలిపివేశారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ వద్ద కంచెలను తీసివేశామని ఆయన ప్రకటించారు. కాకపోతే ఆయన అక్కడ ఉండకుండా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టికి కేటాయించడం విశేషం. అది కాంగ్రెస్ టైమ్‌లో వేసిన కంచె అని కేటీఆర్ గుర్తు చేశారు.
తన ప్రభుత్వం గ్యారంటీలకు కట్టుబడి ఉందని, ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిందని చెప్పుకోవడానికి రేవంత్ యత్నించారు. కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐగా అంటే నాన్ రిలయబుల్ ఇండియన్‌గా అభివర్ణించారు. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అని, చీమలు పెట్టిన పాము మాదిరి చొరబడ్డారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటన్నిటికి కేటీఆర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. సోనియాగాంధీని విదేశాల నుంచి తెచ్చి కాంగ్రెస్‌కు నాయకురాలిని చేసుకున్నారని ఆయన దెప్పిపొడిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పెట్టిన పుట్టలో రేవంత్ పాములా దూరి ముఖ్యమంత్రి పదవిని పొందారని ఆయన వ్యాఖ్యానించారు. తనది మేనేజ్‌మెంట్ కోటా అని అనడాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీలో మేనేజ్ చేసుకుని పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, మంత్రి కోమటిరెడ్డి గతంలో రేవంత్‌పై పేమెంట్ ద్వారా పీసీసీ అధ్యక్షుడు అయ్యారని చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. రేవంత్ నామినేటెడ్ సీఎం అని ఆయన పేర్కొన్నారు.
వీటికి నేరుగా రేవంత్ జవాబు ఇవ్వలేదు. కాకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన ధోరణి మార్చుకోకపోతే, ప్రజలు వారిని బయటకు పంపుతారని, తాను ప్రజల నుంచి వచ్చిన ముఖ్యమంత్రిని అన్నారు. ఇది తండ్రి ద్వారా వచ్చిన పదవి కాదని సమాధానం ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందడం ఆరంభం అయిందని, వంద రోజుల తర్వాత కౌంట్ డౌన్ మొదలవుతుందని కేటీఆర్ హెచ్చరించారు. మహాలక్ష్మి స్కీములు మూడు అంశాలు ఉంటే మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేసి మొత్తం చేసేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అది కూడా కొన్ని బస్సులకే పరిమితం చేస్తున్నారని అన్నారు. గ్యాస్ బండను రూ.500 రూపాయలకే ఇస్తారని, ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున ఇస్తారని అంతా ఎదురు చూస్తున్నారని అన్నారు.
మొదటి క్యాబినెట్‌లోనే అన్ని చేసేస్తామని అన్నారని, ఎందుకు ఇంకా ఆరంభించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ , రైతుబంధు పదిహేను వేల రూపాయలు ఇంకా అమలు కాలేదని అన్నారు. రేవంత్ కానీ, ప్రభుత్వ పక్షం కానీ, వీటన్నిటిని అమలు చేస్తామని అన్నారే తప్ప, నిర్దిష్ట గడువు చెప్పలేకపోయారు. కాకపోతే వందరోజుల కార్యాచరణ అని అంటున్నారు. ఈ విషయంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా గట్టిగానే మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి సుమారు మూడు లక్షల కోట్లు అవసరం అవుతాయని, వాటిని ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు. అయినా చేస్తారని ఆశిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, శాసనసభలో ఆయా పార్టీల బలాబలాలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ వ్యూహాత్మకంగా ఎంఐఎం వారిని తనవైపు తిప్పుకునే యత్నం చేసినట్లు కనిపిస్తుంది.
అందుకే బీఆర్ఎస్‌లో బాగా సీనియర్లుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి వంటివారిని కాదని, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రోటెమ్ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంఐఎం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ సమావేశం అవడం కూడా గమనించదగిన అంశమే. నిజానికి ఎంఐఎం పక్షం బీఆర్ఎస్‌కు మిత్ర పక్షంగా ఉంది. వారికి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు పూర్తిగా బీఆర్ఎస్ వైపు ఉంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని భావించి రేవంత్ వారిని తనవైపు తిప్పుకునే యత్నం చేసినట్లు అనిపిస్తుంది.
కాగా రేవంత్ డ్రగ్స్ అంశాన్ని లేవనెత్తి బీఆర్ఎస్‌ను బాగా ఇరుకున పెట్టాలని కూడా యత్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను రేవంత్ ఏకరువు పెడితే, తమ తొమ్మిదిన్నరేళ్ల ప్రభుత్వం సాధించిన విజయాలను కేటీఆర్ ప్రచారం చేసుకున్నారు. విశేషం ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ ప్రతిపక్ష టీడీపీలో ఉండి తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. ఇప్పుడు వాటిని కాంగ్రెస్ ఘనతలుగా ఆయన చెప్పవలసిరావడం రాజకీయాలలో ఉండే ఒక చిత్రమైన పరిణామం.
కేసీఆర్ గొప్పదనం గురించి కేటీఆర్ అభివర్ణిస్తే, కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ అని రేవంత్ బదులు ఇచ్చారు. మొత్తం మీద రేవంత్, కేటీఆర్‌లు ఒకరికొకరు ధీటుగా వాదోపవాదాలు సాగించారని చెప్పవచ్చు. వీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో శాసనసభలోను, బయటా రాజకీయం రంజుగానే ఉంటుంది. ఇక్కడ ఒక షరతు పెట్టాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏమీ మారకుండా ఉండాలి. అలాగే కాంగ్రెస్‌లో గ్రూపుల వల్ల రేవంత్ ఇబ్బంది పడకుండా ఉండాలి. ఈ రెండిటిలో ఏది జరిగినా మళ్లీ రాజకీయాలు మారిపోతాయి.
::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment