సాక్షి, కామారెడ్డి: ‘యాభై ఏండ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెసోళ్లు ఎన్ని ఘనకార్యాలు జేసిండ్రో జూసినం. ఇప్పుడు అధికారం కోసం అలవికాని హామీలు ఇస్తున్నరు. వాళ్ల మాటలు నమ్మితే మోసపోవుడే. అంతేగాదు వాళ్లు అధికారంలో ఉంటే కుంభకోణాల కుంభమేళా తీసుకువస్తరు..’అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి పట్టణంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా రు. ఎల్లారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఎవరు కావాలో ఆలోచించుకోండి..
కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు దొంగరాత్రి కరెంటుతో ఎంతోమంది రైతులు కరెంటు షాకులు, పాముకాట్లకు బలయ్యారని, అప్పుడు అరిగోస పెట్టి, ఇప్పుడేమో చిలకపలుకులు పలుకుతున్నారని కేటీఆర్ విమర్శించారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నాడని, మూడు పంటల కేసీఆర్ కావాలా? మూడు గంటల కాంగ్రెస్ కావాలా? మతం పేరుతో మనమధ్య పంచాయతీ పెట్టే బీజేపీ కావాలా? రైతులు ఆలోచించాలన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచిందని, కాంగ్రెస్ మాటలు నమ్మి వాళ్లకు ఓట్లేస్తే రాష్ట్రం మళ్లీ పాత రోజుల్లోకి పోవలసి వస్తుందని హెచ్చరించారు. అప్పుడు ఎక్కడ చూసినా దుర్భిక్షం ఉండేదని, ఇప్పుడు మిషన్ కాకతీయతో చెరువులన్నీ బాగుపడి భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. 24 గంటల కరెంటుతో రైతులు మంచి పంటలు పండిస్తున్నారని చెప్పారు.
ఏం జేసిండ్రో చెప్పి ఓట్లడుగుండ్రి..
కాంగ్రెస్‌కు ఓటేస్తే ధరణి, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు.. అన్నీ పోయి దళారుల రాజ్యం వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కాలిన మోటార్లతో రైతులు పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకుని ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గడపగడపకు కాంగ్రెస్ అంటూ తిరుగుతున్న షబ్బీర్‌అలీ లాంటి నాయకులు యాబై ఏండ్లలో ఏం పీకిండ్రని మంత్రి నిలదీశారు. షబ్బీర్ మంత్రిగా ఉండి కామారెడ్డిని జిల్లా చేయలేదని, కామారెడ్డికి మెడికల్ కాలేజీ తీసుకురాలేదని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు తాము అధికారం వెలగబెట్టి ప్రజలకు ఏం జేసిండ్రో చెప్పి ఓట్లడగాలని పేర్కొన్నారు. ధరల పెరుగుదల పాపం కేంద్రంలోని బీజేపీదేనన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసే గొప్పనాయకుడని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి ఒక్క గురుకులాలు తీసుకువచ్చి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రెండొందలు ఉన్న పింఛన్‌ను తాము రూ.2 వేలకు, ఐదొందలు ఉన్న పింఛన్ రూ.నాలుగు వేలకు చేశామని తెలిపారు.
అప్పుడు ఏది కావాలన్నా ఢిల్లీని అడగాల్సిందే..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టే కేసీఆర్ తాను ఏది చేయాలన్నా కేబినెట్ మీటింగు పెట్టి నిర్ణయం తీసుకుంటాడని, అదే కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే ఏది కావాలన్నా ఢిల్లీని అడగాల్సి ఉంటుందని కేటీఆర్ చెప్పారు. బేకార్‌గాళ్లు, చేతగానోళ్లు, ఢిల్లీ గులామోళ్లు మనకవసరమా? అంటూ ప్రశ్నించారు. సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వస్తే కుంభకోణాల కుంభమేళానే
Published Tue, Aug 15 2023 1:09 AM | Last Updated on Tue, Aug 15 2023 1:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment