సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలంటూ లేఖ రాసిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ.. మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
‘‘మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు?. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్‌కి తెరతీసిన ఘనుడు ఎవరు?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు.
ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై!
గత సీజన్‌లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్‌ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment