కూచ్ బెహార్/అలీపూర్‌ద్వార్: ఎన్నికల కమిషన్(ఈసీ) కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. ముర్షిదాబాద్ డీఐజీని ఈసీ తొలగించడం వెనుక బీజేపీ హస్తముందన్నారు. ఎన్నికల వేళ ముర్షిదాబాద్, మాల్దాల్లో ఒక్క హింసాత్మక ఘటన జరిగినా ఈసీదే బాధ్యతని ఆమె హెచ్చరించారు. అవసరమైతే ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరశన దీక్ష చేపడతానని హెచ్చరించారు.
గతంలో సింగూర్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దర్యాప్తు విభాగాలను కేంద్రం టీఎంసీపైకి ఉసిగొల్పుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపుతామంటూ బీజేపీ బెదిరిస్తోందంటూ ఆమె..‘ఎలా పోరాడాలో నాకు తెలుసు, నేనేమీ పిరికిదాన్ని కాదు’అని మమత వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment