ఓటర్లపై కూటమి ప్రలోభాల వల  | Sakshi
Sakshi News home page

ఓటర్లపై కూటమి ప్రలోభాల వల 

Published Mon, Apr 8 2024 4:43 AM

MLA Malladi Vishnu complained to EC to take action - Sakshi

చర్యలు తీసుకోవాలని ఈసీకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు 

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా షర్మిల వ్యాఖ్యలు 

డబ్బులు పంపిణీ చేస్తున్న కూటమి అభ్యర్థులు కేశినేని చిన్ని, సుజనాచౌదరి  

సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయంలో ఈసీని కలిసి ఆధారాలతో  ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాకు వెల్లడించిన వివరాలు.. 

► రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఘటనలను ఎప్పటికప్పుడు ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నాం. కడప బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని, ఓట్లు మాత్రం కాంగ్రెస్కు వేయమని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడారు. దీనిపై ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశాం.  
► విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ నేత కేశినేని చిన్ని,  ఓట­ర్లను ప్రలోభ పరుస్తూ డబ్బులు పంచడాన్ని కూ­డా ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాం.   ఆనాడు కేంద్ర కేబినెట్లో ఉండి కూడా, రాష్ట్ర ప్రయో­జనాలను సుజనా పూర్తిగా పక్కన పెట్టారు. ప్రత్యేక హోదాను సమాధి చేసి ప్యాకేజీగా మార్చడంలో సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల పాత్రే కీలకం.  

► సీఎస్, డీజీపీలపై నర్సీపట్నం సభలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వాడిన భాష సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. అధికారులను తూలనాడటం, వ్యవస్థలను తేలిక చేసి మాట్లాడటం, చంద్రబాబు నుంచి  అభ్యర్థుల వరకు షరా మామూలైపోయింది. – పింఛన్‌ దారుల విషయంలోనూ ఏవిధంగా కూటమి నేతలు చులకన చేసి మాట్లాడారో  ఈసీ దృష్టికి తీసుకువెళ్లాం.  

మైనార్టీలపై బాబు కపట ప్రేమ 
‘‘మైనార్టీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి ఏమాత్రం లేదు. ఆనాడు దివంగత మహానేత మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ తీసుకువస్తుంటే, కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంది టీడీపీ కాదా? అధికారంలో ఉండి కూడా ఎన్నికలకు ముందు 4 నెలల వరకు మైనార్టీలకు కేబినెట్లో స్థానం కల్పించని వ్యక్తి చంద్రబాబు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ తన తొలి కేబినెట్లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించి,  మైనార్టీల పక్షపాతిగా నిలిచారు’’ అని  విష్ణు పేర్కొన్నారు.

 అమరావతి పేరుతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆడిన డ్రామాలను ప్రజలు గ్రహించినందునే   స్థానిక ఎన్నికల్లో అక్కడి ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారని గుర్తుచేశారు.   రైతు రుణమాఫీని ఎగ్గొట్టి అన్నదాతలకు ద్రోహం చేసిన చంద్రబాబు   రైతు సంక్షేమంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా   ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఎ. నారాయణమూర్తి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.  

సుజనా చౌదరి, కేశినేని చిన్నిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు 
గాం«దీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఎన్నికల ప్రచారంలో భాగంగా హారతి పళ్లెంలో డబ్బులు వేసిన ఘటనపై ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్‌ ఆఫీసులో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బుల పంపిణీపై వార్తా చానల్స్, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్, హారతి పళ్లంలో డబ్బులు వేస్తున్న వీడియోలు ఎన్నికల అధికారులకు అందజేశారు. పూర్తి ఆధారాలు ఉన్నందున ఎన్నికల నియమావళిలో సూచించిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుజనా చౌదరి డబ్బుల సంచులతో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారన్నారు. తొలిరోజే ఆయన కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని    తెలిపారు.

Advertisement
Advertisement