
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు పెద్దగా వినిపించాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇప్పటికి కూడా కాంగ్రెస్ తరపున అమేథీలో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది స్పష్టం కాలేదు. ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపైన కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
2019లో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి పాలైన రాహుల్ గాంధీకి ఈసారి అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఓటమి చవిచూసిన తరువాత కేరళకు వలస వెళ్లారని సింగ్ చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు వామపక్షాలు, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. సీఏఏ చట్టం వల్ల ఎవరి పౌరసత్వం ప్రభావితం కాబోదని సీనియర్ బీజేపీ నాయకుడు హామీ ఇచ్చారు.
అంతరిక్ష రంగంలో దేశం సాధించిన విజయాలు మరియు భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్షయాన కార్యక్రమం అయిన గగన్‌యాన్ వంటి వివిధ రాబోయే ప్రాజెక్టులను కూడా ఆయన ప్రస్తావించారు. అనిల్ కె ఆంటోనీని ప్రశంసిస్తూ.. అతనికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కేరళలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.