Malkajgiri Lok Sabha: అందరి దృష్టి ఆ సీటుపైనే | Parties Focusing On Malkajgiri Constituency | Sakshi
Sakshi News home page

Malkajgiri Lok Sabha: అందరి దృష్టి ఆ సీటుపైనే

Published Mon, Feb 19 2024 9:00 AM | Last Updated on Mon, Feb 19 2024 12:54 PM

Parties Focusing On Malkajgiri Constituency  - Sakshi

సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి. ఇప్పుడు దానిపైనే అందరి గురి. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని రాజకీయ పక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. కేంద్రంలో మళ్లీ తమదే అధికారమని చెబుతున్న బీజేపీ నేతలు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌ ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్‌.. రాష్ట్రంలో గెలుపుతోనే తమ లక్ష్యం పూర్తి కాలేదని లోక్‌సభలోనూ బలం చాటేందుకు వ్యూహరచన చేస్తోంది.  

అన్ని పారీ్టలకూ హాట్‌ సీట్‌ 
అన్ని పారీ్టలూ వేటికవి మల్కాజిగిరిలో గెలుపుతో బలం చాటుకోవాలని ఆరాటపడుతున్నాయి. టికెట్‌ కోసం మాత్రం కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న వారితో పాటు కొత్తగా చేరుతున్న వారు సైతం దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం హామీలిస్తుందో లేదో కానీ ఎవరికి వారుగా ఈ సీటును దక్కించుకోవాలనే తలంపుతోనే ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీగా ఉంటూనే రేవంత్‌రెడ్డి అటు పీసీసీ అధ్యక్షుడిగా విజయం సాధించడంతో పాటు ఇటు ముఖ్యమంత్రి కావడంతో సెంటిమెంట్‌ పరంగానూ భారీ డిమాండ్‌ ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహించే రేవంత్‌ వారసుడెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

ఎందరెందరో.. 
మల్కాజిగిరి లోక్‌సభ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న వారిలో కంచర్ల చంద్రశేఖరరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, బొంతు రామ్మోహన్, సింగిరెడ్డి హరివర్ధ¯న్‌రెడ్డిలతో పాటు ఇంకా కాంగ్రెస్‌లో చేరనివారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో కంచర్ల చంద్రశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు మామ కావడంతో పాటు ఇటీవలే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో చంద్రశేఖరరెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన భువనగిరి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోరుకున్న చోట కాకుండా మహేశ్వరం టికెట్‌ ఇవ్వడంతో ఓటమిపాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఈసారి ఎంపీ సీటు కోసం ప్రయతి్నస్తున్నట్లు వినికిడి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి ఎంటీ టికెట్‌ కోసం ప్రయతి్నస్తున్నట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కని సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత భర్త, బీఆర్‌ఎస్‌ నేత మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణలు సైతం మల్కాజిగిరి టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 

అటు నుంచి ఇటు.. 
ప్రముఖ వ్యాపారి, మహబూబ్‌ నగర్‌ జిల్లా మాజీ ఎమ్మెల్యేకు కూడా కాంగ్రెసే ఆఫర్‌ ఇచి్చనట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు బీఆర్‌ఎస్‌ను వీడి వస్తే ఆయనకు మల్కాజిగిరి టికెట్‌ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం పార్టీ మారి తిరిగి ఎంపీగా పోటీకి సిద్ధమైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏయే పారీ్టల నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారో.. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నియోజకవర్గ ఎంపీ టిక్కెట్‌ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement