సాక్షి, గుంటూరు: మేం పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేం వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీలోనే ఉంటా: పిల్లి సుభాష్ చంద్రబోస్
వైస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తో ఉన్నా.. నా వ్యక్తిత్వం ఏంటో అందరికి తెలుసు. నన్ను వైఎస్సార్ రాజకీయాల్లో ప్రోత్సహించారు. రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావు కూడా రావాల్సి ఉంది. ఇతర కారణాల వలన రాలేకపోయారు. కానీ వారిద్దరు కూడా వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పమన్నారు. జగన్ నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. కానీ నా మీద కూడా ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. నాకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కూడా జగన్ అన్నారు. అంతగా వైఎస్ జగన్ నన్ను గౌరవించారు.
...కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా వైఎస్సార్ వెంటే ఉన్నాను. అప్పట్లో టికెట్ గురించి కూడా ఎవర్నీ అడిగేవాడిని కాదు. వైఎస్సారే నాకు అర్ధికంగా, రాజకీయంగా అండగా నిలిచారు. ఆ తర్వాత కూడా జగన్ అలాగే అండగా నిలిచారు. ఆర్థికంగా పేదవాడినే అయినా విధేయతలో సంపన్నుడునే. నాకు వ్యాపారల్లేవు, ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను. నా మీద వార్తలు రాసేటపుడు ఒకసారి మాట్లాడితే సరిపోయేది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. ఇలా చేయటం రాజకీయ హననం చేసినట్లే. నైతికత ఉన్న నాయకుడిని నేను.
..మేము రాజీనామా చేస్తే మరొకరిని నియమించే అవకాశం లేదు. అలాంటప్పుడు మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టే. అలాంటి కృతజ్ఞ హీనులం మేము కాదు. పార్టీని హత్య చేసే పని నేను చేయను. పార్టీ నుండి వెళ్లేవారు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మంచిది. ఏ పార్టీ ఐనా ఓడుతుంది, గెలుస్తుంది. అధికారం శాశ్వతం కాదు, జయాపజయాలు సహజమే. వైఎస్సార్‌సీపీ ఇవాళ ఓడిపోయినంత మాత్రాన నేను పార్టీ వీడి వెళ్లను. నూటికి నూరుపాళ్లు వైఎస్ జగన్ నాయకత్వంలోనే పని చేస్తా. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్సార్‌సీపీలోనే ఉంటా’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.
ఊహాజనిత కథనాలను ఖండిస్తున్నాం: ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
మాపై కొన్ని మీడియా సంస్థలు ఊహాజనిత కథనాలు రాస్తున్నాయి. పార్టీ వీడుతున్నట్టు వారు రాస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. మేము పార్టీ చెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తాం. ఈ రోజు పార్టీలను నడపటం చాలా కష్టంతో కూడుకున్న పని. రాజకీయ పార్టీలు పటిష్టంగా ఉంటే గట్టి నాయకులు తయారవుతారు. మేము ఎంపీలుగా బాధ్యతతో పని చేస్తున్నాం. జగన్ సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తారు. అందుకే ఆయనతో కలిసి రాజకీయాల్లో నడుస్తున్నాను.
..పదేళ్ల క్రితమే నేను వ్యాపారాలు మానేశాను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన బాధ పడాల్సిన పనిలేదు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే నడుస్తాం. మోపిదేవి రమణ అంటే జగన్‌తో సహా మా అందరికీ ఇష్టం. ఆయన పొజిషన్ ని స్ట్రాంగ్ చేసే పనిలో జగన్ ఉన్నారు. కొందరు పర్సనల్ వ్యవహారాల వలన పార్టీ వీడుతున్నారు. నన్ను కూడా పార్టీలోకి రమ్మని కొందరు ఆహ్వానించారు. కానీ జగన్‌ని కాదని నేను ఎటూ వెళ్లను. రేటింగ్స్ కోసం మా గురించి ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేయొద్దని మనవి
Comments
Please login to add a commentAdd a comment