
వీగిపోతుందని తెలిసి కూడా అవిశ్వాసం పెడుతున్న ఇండియా కూటమి..
ఢిల్లీ: ఎన్డీయే సర్కార్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన వేళ.. మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. విపక్షాలు మళ్లీ 2023లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్ల కిందట మాట్లాడిన మాటల్ని బీజేపీ వైరల్ చేస్తోంది.
2019 ఫిబ్రవరి 7వ తేదీన బడ్జెట్ సమావేశాల టైంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సమయంలో 2023లో ప్రతిపక్షం మరో అవిశ్వాసానికి రెడీ అవుతుందని వ్యాఖ్యానించారు. ‘‘2023లో మరో అవిశ్వాసంతో ముందుకు వచ్చేలా వాళ్లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ఆయన ప్రసంగించగా.. పక్కనే ఉన్న రాజ్‌నాథ్ సహా అధికార ఎంపీలంతా టేబుల్స్‌ను తట్టి నవ్వులు చిందించారు.
‘‘మేం చేసిన సేవకు ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. అహంకారంతో వాళ్లు 400 నుంచి 40కి పడిపోయారు. ఇవాళ వాళ్లు ఎక్కడున్నారో చూడండి.. అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు సైతం అక్కడే ఉన్నారు.
VIDEO: PM Sh @narendramodi had made a prediction 5 years back about the opposition bringing a No confidence motion! pic.twitter.com/dz8McicQ40
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 26, 2023
అంతకు ముందు ఏడాది అంటే.. 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇండియా కూటమి, బీఆర్‌ఎస్ పార్టీ వేర్వేరుగా ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతిస్తూ.. అఖిలపక్ష భేటీ తర్వాత తేదీని నిర్ణయయిస్తామని లోక్‌సభలో వెల్లడించారు.