అచ్చంపేట: పోలీసులు రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించాలని.. లేకపోతే రాజ్యాంగేతర శక్తులు పుట్టుకొస్తాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోలీసులు చట్టాన్ని తుంగలో తొక్కి అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా నడుచుకుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా లింగరోనిపల్లి శివారులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ఎస్‌ఐ మొదలుకొని డీఎస్పీ వరకు ఎమ్మెల్యేల ఆదేశాలే పాటిస్తున్నారని ఆరోపించారు.
ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తాం: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. జీఓ 317ను రద్దు చేసి పాత విధానంలోనే బదిలీలు చేపడతామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని, ధరణిని ఎత్తివేస్తామని చెప్పారు. పోడు భూములపై గిరిజన రైతులకు హక్కు కల్పిస్తూ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్యూడలిజాన్ని తిరిగి తీసుకొచ్చేందకు సీఎం ధరణి తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
ముందుస్తు అరెస్టులు సరికాదు: కాంగ్రెస్ పార్టీని దేశంలో, తెలంగాణలో నిషేధించారా..? ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వాహనాలకు ముందు, వెనక పోలీసు ఎస్కార్టు పెట్టుకొని.. ముందుస్తు అరెస్టులు చేయించేవాళ్లు అసలు ప్రజాప్రతినిధులేనా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment