
తెలుగుదేశం, జనసేన కూటమి ఏపీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. చంద్రబాబు, ఆయన సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఏ పేరుతో సభలు నిర్వహించినా ప్రజలు రావడంలేదు. యువగళం దగ్గర నుంచి శంఖారావం వరకు.. మంగళగిరిలో నిర్వహించిన బీసీ జయహో సభకు జనం దూరంగానే ఉన్నారు. చిన్న చిన్న మైదానాల్లో సభలు పెట్టినా కనీసం కుర్చీలు కూడా నిండటంలేదు. చంద్రబాబు ఉపన్యాసాలకు స్పందన కూడా ఉండటంలేదు.
ఏపీలో ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతూ.. విశ్వసనీయత కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు ప్రజలు మొహం చాటేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్.. ఆఖరుకు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరైనా కూడా ప్రజలు స్పందించడంలేదు. పొలిటికల్ గ్లామర్, సినీ గ్లామర్ అనుకుంటున్నా.. ఏ గ్లామర్ పనిచేయడం లేదు. సభలకు వచ్చిన జనాలను చూసి చంద్రబాబు, లోకేష్, పవన్, బాలకృష్ణ తెల్ల మొహాలు వేస్తున్నారు. జనాలు తక్కువగా ఉండడంతో పార్టీ నేతలపై మండిపడుతున్నారు. జనాలను సమీకరించడం చేతకాదంటూ వారిపై చిందులు తొక్కుతున్నారు.
చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్రలో భాగంగా అక్కడక్కడా బహిరంగ సభలు నిర్వహించేవారు. దానికి సమాంతరంగా చంద్రబాబు ఇదేమి ఖర్మ రా బాబు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఈa రెండు కార్యక్రమాలు అయిన తర్వాత.. రా కదలిరా అంటూ ప్రతీ జిల్లాకు ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఇవికాక.. తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఉమ్మడిగా తెలుగు జన సభలు పేరుతో బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో ఒక సభ.. తాజాగా మంగళగిరిలో మరో సభ నిర్వహించారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కేవలం లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని బీసీ డిక్లరేషన్ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం నుంచి కర్నూల్ వరకు ఉన్న కొందరు బీసీ నేతలు సభకు హాజరైనా జనం మాత్రం వీరిని పట్టించుకోలేదు.
కొంతకాలం నుంచి చంద్రబాబు, లోకేష్, పవన్ ఎన్ని సభలు నిర్వహిస్తున్నా.. అక్కడ కనిపిస్తున్నది.. జనం కాదు.. కేవలం ఖాళీ కుర్చీలు మాత్రమే. పది నుంచి పదిహేను వేలు మాత్రమే కుర్చీలు వేస్తున్నా అవి కూడా చాలావరకు ఖాళీగానే ఉంటున్నాయి. తెలుగుదేశం మీటింగ్‌లకు జనం రాకపోవడమే కాదు.. అసలు టీడీపీ కార్యకర్తలు కూడా మొహం చాటేస్తున్నారు.
చంద్రబాబు మోసపూరిత ప్రసంగాలు విని వినీ జనానికి విసుగెత్తిపోతోంది. మరోసారి మోసపోవడానికి జనం ఎవరూ సిద్ధంగా లేరు. 2014 ఎన్నికల్లో 650 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోగా.. టీడీపీ వెబ్‌సైట్ నుంచి దాన్ని మాయం చేశారు. దీనిపై ప్రజలు అడిగే ప్రశ్నలకు టీడీపీ కేడర్ కూడా సమాధానాలు చెప్పలేక.. సిగ్గుపడుతున్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తుండటంతో సూపర్ సిక్స్ పేరుతో ఇస్తున్న హామీలను ఎవరూ విశ్వసించడంలేదు.
ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం దివంగత రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలే చెబుతున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రి జగన్ మీద ప్రజలకు నమ్మకం ఉంది గనుక సిద్దం బహిరంగ సభలకు ఊహించిన దాని కంటే అధికంగా లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడుకి సీఎం జగన్‌కు ఉన్న తేడా అని టీడీపీ నేతలే స్వయంగా కామెంట్ చేస్తున్నారు.