ముంబై: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 3న జరగే అంధేరీ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. థాక్రేవర్గం తరఫున పోటీ చేయనున్న రుతుజా లాట్కే రాజీనామాను బృహన్‌ముంబై పురపాలక కమిషనర్ శుక్రవారం ఉదయం 11గంటల్లోగా ఆమోదించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే ఆమోదించడానికి ఇంత సమయం ఎందుకుపట్టిందని, ఇది కోర్టుకు రావాల్సిన విషయం కూడా కాదని ముంబై పురపాలక కమిషనర్ ఇక్బాల్ చాహల్‌ను ఉన్నత న్యాయస్థానం మందలించింది.
అంధేరీ ఎమ్మెల్యే రమేశ్ లాట్కే మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉద్దవ్ థాక్రే వర్గం తరఫున రమేశ్ లాట్కే సతీమణి రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. అయితే ఆమె బృహన్ ముంబై కార్పొరేషన్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఉపఎన్నికకు నామినేషన్ వేయాలంటే ఆమె పదవికి రాజీనామా చేయాలి. సెప్టెంబర్ 2నే రాజీనామా సమర్పించినప్పటికీ దాన్ని కమిషనర్ ఆమోదించలేదు. నామినేషన్లకు శుక్రవారం(అక్టోబర్ 14) చివరి తేదీ కావడంతో రితిజా హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా కావాలనే రాజీనామా ఆమోదించడం లేదని కోర్టుకు తెలిపారు. షిండే ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
వాదనలు విన్న న్యాయస్థానం రుతుజాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం ఆమె నేరుగా వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కలిశారు. చివరిరోజైన శుక్రవారం నామినేషన్ సమర్పించనున్నారు. అంధేరీ ఉపఎన్నికలో థాక్రేవర్గం అభ్యర్థికి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుగా ఉన్నాయి. మరోవైపు షిండే వర్గం మద్దతుతో బీజేపీ తమ అభ్యర్థిని నిలబెడుతోంది.
చదవండి: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!
Comments
Please login to add a commentAdd a comment