సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల వరుస బహిరంగ సభలతో రాష్ట్రాన్ని హోరెత్తించాలని బీజేపీ నాయకత్వం నిర్ణ యించింది. వచ్చేనెల రెండోవారంలోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయన్న అంచనాలతో.. రాష్ట్రమంతా ఒకేసారి బీజేపీకి ప్రజల్లో సానుకూలత పెంచడంతో పాటు పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపేలా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం లేదన్న ఉద్దేశంతో ఈ నెల 26 నుంచి 14 రోజులు మూడు ప్రాంతాల నుంచి తలపెట్టిన రథ (బస్సు) యాత్రలను పార్టీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ యాత్రలకు బదులు అగ్రనేతల బహిరంగ సభలతో రాష్ట్రంలో కార్యకలాపాలు వేగం పుంజుకునేలా చేయా లని జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఉ మ్మడి జిల్లాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాలు కవరయ్యేలా మోదీ, అమిత్‌షా, నడ్డాల త్రయంతో సభల నిర్వహణకు ప్ర ణాళికలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే 2, 3 వారాల్లోనే వరుస సభల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
2, 3 తేదీల్లో మోదీ పర్యటన?
బీజేపీ కార్యాచరణలో భాగంగా వచ్చేనెల 2, 3 తేదీల్లో ప్రధా ని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల పరిధిలో కనీసం రెండుచోట్ల రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించాలనే ఆలోచనతో పార్టీ నాయకులున్నట్టు సమాచారం. అదేవిధంగా మిగతా ఉమ్మడి జిల్లాలను కవర్ చేసేలా అమిత్ షా, నడ్డాల సభలు కూడా ప్లాన్ చేశారు.
అక్టోబర్ 6వ తేదీలోగా అమిత్‌షా సభలు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లోనే అగ్రనేతల పర్యటనలు, వారు పాల్గొనబోయే బహిరంగ సభలకు సంబంధించి షెడ్యూల్ ఖరారయే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్ర తిపక్ష కాంగ్రెస్ తేరుకునే లోగానే అగ్రనేతల విస్తృత పర్యటనలు పూర్తిచేసేలా షెడ్యూల్‌కు రూపకల్పన చేస్తున్నారు.
జన సామాన్యంలోకి వెళ్లేలా..
తొమ్మిదేళ్లలో కేంద్రంలో బీజేపీ సర్కార్ సాధించిన అభివృద్ధి, అవినీతి రహిత పాలన, కుటుంబ, వారసత్వ రాజకీయాలకు తావు లేకుండా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు చేకూరిన లబ్ధి, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆ రోపణలు, ప్రధానమైన హామీలు సైతం నెరవేర్చక పో వడం తదితర అంశాలు బీజేపీ అగ్రనేతలు ప్రస్తావించ వచ్చని అంటున్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా తీరు, అవినీతి ఆరోపణలు, కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడం లాంటివి వివరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విధంగా నిర్వహించే ప్రచారం ద్వారా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment