న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం గురువారం విడుదల చేసింది. ఇటీవల హర్యానా సీఎం పదవికి అనూహ్య రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది.
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు.
ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.
ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1) ఢిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20),, త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది.
తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు..
- మహబూబ్‌నగర్: డీకే అరుణ
- మెదక్: రఘునందన్ రావు
- ఆదిలాబాద్: నగేష్
- మహబూబాబాద్ : సీతారాం నాయక్
- నల్గొండ : శానం సైదిరెడ్డి
- పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్
రెండో జాబితాలో ప్రముఖులు
బీజేపీ రెండో జాబితాలో పలువురు కేంద్ర మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, కేంద్ర సమాచారం బ్రాడ్‌కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు అవకాశం ఇచ్చింది. వీరితోపాటు కర్ణాటక మాజీ సీఎం, షిగ్గావ్ ఎమ్మెల్యే బసవరాజ్ బొమ్మెకు ఈసారి ఎంపీగా చాన్స్ ఇచ్చింది. హవేరి నుంచి ఆయన లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్‌రావత్ బరిలో నిలిపింది.
నితిన్ గడ్కరీ- నాగ్‌పూర్(మహారాష్ట్ర)
- పీయూష్ గోయల్- ముంబై నార్త్(మహారాష్ట్ర)
- ప్రహ్లాద్ జోషి, ధార్వాడ్(కర్ణాటక)
- అనురాగ్ ఠాగూర్- హమిర్‌పూర్( హిమాచల్ ప్రదేశ్)
- మనోహర్‌లాల్ ఖట్టర్- కర్నాల్( హర్యానా)
Comments
Please login to add a commentAdd a comment