
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీపావళీ పండగ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 2022లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అమలు చేయబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి కూటమిగా ఏర్పాటు కాబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం దీపావళి పండగ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా లక్నో, ఏటవాలో పార్టీ ప్రముఖలతో పలు భేటీలు జరిపాము. అన్ని ప్రాంతాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. బీజేపీ అభివృద్ధి పనులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది’ అన్నారు. రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో కూటమిగా ఏర్పడదని, కేవలం చిన్న పార్టీలతో మాత్రమే కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయిని తెలిపారు. చదవండి: (అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి)
ఈ విషయాన్ని పలు వేదికలపై తెలిపానని ఆయన గుర్తు చేశారు. మరో వైపు జస్వంత్‌నగర్ విషయంలో ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ 2017 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీగా అభ్యర్థిగా జస్వంత్‌నగర్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఎస్పీ నుంచి బయటకు వచ్చి 2019లో సొంతంగా ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ నీ స్థాపించారు. ఇక ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2022లో జరగనున్నాయి.