చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ నాయకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బీజేపీ జాతీయ నాయకుడు సునీల్ దేవ్‌ధర్ అయితే చంద్రబాబు నాయుడికి వీర ఫ్యాన్. గతంలో చంద్రబాబు టాలెంట్ గురించి సునీల్ దేవ్‌ధర్ చక్కగా వివరించారు. రాజకీయాలకు సంబంధించి చంద్రబాబును కట్టప్పతో పోల్చారు డియోరా. బీజేపీతో ఎక్కువ సార్లు పొత్తులు పెట్టుకున్నారు కాబట్టే చంద్రబాబు గురించి బీజేపీ నేతలకు బాగా తెలుస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు.
సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ బాహుబలులు ఉంటారు. వారి వెనకాలే కట్టప్పలూ పుట్టుకు వస్తారు. చంద్రబాబు నాయుడి గురించి ఎల్లో మీడియా ఎన్ని గప్పాలు కొట్టినా.. చంద్రబాబును బాహుబలి అని మాత్రం ములగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చంద్రబాబుకు సరిపోదని వాళ్లకీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎనభైలలో రాజకీయాల్లో బాహుబలి అంటే ఎన్టీఆర్ అనేవారు. కాంగ్రెస్ ఏకఛత్రాధి పత్యానికి గండి కొట్టిన బలవంతుడు ఎన్టీఆర్.
మరి చంద్రబాబు ఎవరు? ఆయన గురించి మనం చెప్పుకునే కంటే బీజేపీ నేతలను అడిగితే సరిపోతుంది. అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక అన్నట్లు చంద్రబాబు గురించి బీజేపీ నేతలకు బాగా తెలుసు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని చాలా దగ్గరుండి అధ్యయనం చేసిన బీజేపీ జాతీయ నాయకుడు, గతంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన సునీల్ దేవ్‌ధర్ అయితే గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు గురించి తనకున్న అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారో మరొక్కసారి విందాం.
జన్మభూమి కమిటీ సభ్యులు దొంగలయితే చంద్రబాబు నాయుడు గజ దొంగ అని బిరుదు ఇచ్చారు సునీల్ దేవ్‌ధర్. అక్కడితో ఆగలేదు చంద్రబాబును మించిన కట్టప్ప మరొకరు లేరన్నారు. ఎన్టీఆర్‌కే కాదు నమ్మి పొత్తులు పెట్టుకున్న నరేంద్ర మోదీనీ.. మోదీతో కలిసి వచ్చినపుడు గెలిపించిన ఏపీ ప్రజలను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. అంతేకాదు, అమరావతి ప్రాంతాన్నీ అక్కడి రైతుల ఆశలను సర్వనాశనం చేసింది కూడా చంద్రబాబే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు దొంగతనాలను ఆయన వెన్నుపోటు కథలను ఆయన మోసకారితనాలను నిశితంగా గమనించారు కాబట్టే సునీల్ ఇంత చక్కగా చెప్పగలిగారు.
రెండేళ్ల క్రితం చంద్రబాబు మళ్లీ ఎన్డీయేలోకి వస్తానంటే ఆహ్వానిస్తారా అని మీడియా ప్రశ్నించగా ఇదే దేవ్‌ధర్ చంద్రబాబుకు ఎన్డీయేలో చోటు లేదన్నారు. అటువంటి మోసగాడిని మరోసారి కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే, చంద్రబాబుతో సావాసం వల్ల వచ్చిన సమస్య ఏంటో కానీ బీజేపీ కూడా యూ టర్న్ తీసుకుని చంద్రబాబు పొత్తు కోసం కాళ్లమీద పడగానే సరేలే.. పోనిలే అన్నట్టుగా ఒప్పుకుంది. ఇది బీజేపీకి ఎంత మాత్రం మంచిది కాదని.. సునీల్ దేవ్‌ధర్ చెప్పినట్లు త్వరలోనే చంద్రబాబు మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment