న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తొలిసారి షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.
లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్30) విచారించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్‌ను ఈడీ 2022లో అరెస్టు చేసిందని, కేజ్రీవాల్‌ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు.
ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనేదానిపై క్లారిటీ లేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్‌మెంట్ ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని చెప్పారు. అయితే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి మొదట్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని, తర్వాతే మాట మార్చారని వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment