సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో పచ్చమూకలు చెలరేగిపోతున్నారు. టీడీపీ నేతల విధ్వంసాలు ఆగడం లేదు. తాజాగా, వైఎస్సార్ జిల్లా మైలవరం మండలంలో టీడీపీ నేతలు దాడులకు దిగారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద 18 లారీలను ధ్వంసం చేశారు. కప్పం కట్టలేదని లారీలను టీడీపీ నేతలు ధ్వసం చేశారు. కప్పం కట్టకుంటే లారీలను తిరగనివ్వమని బెదిరింపులకు దిగారు.
కాగా, పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం ఈ విధ్వంసకాండ కొనసాగింది. పల్నా డు జిల్లా దుర్గిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దుర్గి బస్టాండ్ సెంటర్‌లోని ఈ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్త ఇనుపరాడ్డుతో కొట్టి ధ్వంసం చేశాడు. స్థానికులు అతడిని అడ్డుకున్నారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెలి దండి గోపాల్ నేతృత్వంలో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వెలిదండి గోపాల్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఆవేశాలకు లోనుకాకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్పంచ్ రాయపాటి మాణిక్యం, వైఎస్సార్‌సీపీ మండల యూత్ కన్వీనర్ యకటీల బుచ్చిబాబు, నాయకులు తోటకూర వెంకటేశ్వర్లు, చెన్నుపాటి సీతారామయ్య, జంగా కొండలు, వెలిదండి జ్యోతి, శెట్టిపల్లి కోటేశ్వరరావు, చింతా రామకృష్ణ, చింతా నరసింహారావు, తోట మూర్తి, బత్తుల శ్రీనివాసరావు, యకటీల శ్రీను, తురక శ్రీను తదితరులున్నారు.
బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని ద్రోణాదుల గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంతకుముందు గ్రామంలోని రెండు సచివాలయాల్లో శిలాఫలకాలను పగులగొట్టారు. గ్రామంలో విధ్వంసాలను అధికారులు అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు కోరుతున్నారు.
బాపట్ల జిల్లా జువ్వలపాలెం పాత ఎస్సీ కాలనీలోని డాక్టరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గతంలో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి మంత్రి మేరుగ నాగార్జున ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. జువ్వలపాలెం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి పసుపు రంగులు పూశారు. సచివాలయ భవనంపై టీడీపీ నాయకుల చిత్రాలతో ప్లెక్సీలు ఉంచారు. ఈ ఘటనల్ని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment