మల్లాపూర్(కోరుట్ల)/మల్లాపూర్: వరి వేస్తే ఉరే.. అని చెప్పిన కేసీఆర్ ఒక సన్నాసి ముఖ్యమంత్రి అని, రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న బంగారం లాంటి తెలంగాణను రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలోకి ప్రవేశించింది.
వివిధ గ్రామాల గుండా ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వస్తారని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా షర్మిల యాత్ర టీఆర్‌ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సొంత గ్రామమైన రాఘవపేటకు చేరుకున్న సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై విమర్శిస్తూ ప్రసంగించారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు షర్మిల ప్రసంగాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment