
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా బీఅర్ఎస్‌లో తుమ్మల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్ అధిష్టానంతో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధమయ్యారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరే ముందు బాగోద్వేగానికి లోనయ్యారు మాజీ మంత్రి. కాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత పాలేరు టికెట్ రాకపోవడంతో తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
నేడు భారీ బల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంకు వస్తున్న తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు. 2 వేల కార్లతో భారీ ర్యాలీగా బల ప్రదర్శన చేయనున్నారు.
ఇక తుమ్మల పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించగా.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన అశ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో భంగపడ్డారు. పాలేరు టికెట్‌ను కందాల ఉపేందర్ రెడ్డికి అధిష్టానం కేటాయించడంతో.. పార్టీలో కనీస గౌరవమర్యాదలు లేకపోవడంపై అలకబూనారు. రాయబారాలు, బుజ్జగింపులపై అసహనంతో ఉన్న తుమ్మల.. పొలిటికల్‌గా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్ర ఆసక్తి నెలకొంది. అటు తుమ్మల అనుచరులు మాత్రం కాంగ్రెస్‌లోకి వెళ్లాలని మాజీ మంత్రిపై ఒత్తిడి చేస్తున్నారు.
చదవండి: Paleru Assembly Constituency: పాలేరు నియోజకవర్గం గొప్ప రాజకీయ చరిత్ర
కాగా.. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన. ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా. అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారు. 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా.. తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా కూడా ఆయన పాలేరు నుంచి టికెట్ ఆశించారు.