
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి తమ నాయకుడని, ఆయనకు పార్టీ నేతలందరం అండగా ఉంటామన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ జగ్గారెడ్డి వ్యవహారం తమ కుటుంబ సమస్య అని, అందరం కలసి మాట్లాడుకుంటామన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు వచ్చా యని కుంగిపోవద్దని, తనపైనా గతంలో ఇలాంటి పోస్టులు వచ్చాయన్నారు. జగ్గారెడ్డి రాజకీయాల్లో రాకముందు నుంచే ఆయనతో పరిచయం ఉందని, ఆయన మంచి స్నేహితుడన్నారు. జగ్గారెడ్డి పార్టీ అధిష్టానం అపాయింట్‌మెంట్ కోరారని, ఆయనతో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని వివరించారు. కాగా, జగ్గారెడ్డి 2, 3 రోజుల్లో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు.
నలుగురు మహిళలకు మంత్రి పదవులు...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నలుగురు మహిళా నేతలకు కీలక మంత్రి పదవులు కేటాయిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఏఐసీసీ మహి ళా కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘లడ్‌కీ హూ... లడ్ సక్తీ హూ’కార్యక్రమం గాంధీ భవన్‌లో జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు గాంధీ భవన్ నుంచి నాంపల్లి వరకు పార్టీ మహిళా నేతలు ర్యాలీ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment