ముందుగా నాయకుల హామీలపై.. రెండు మాటలు సరదాగా.. అసలే చలికాలం.. ఆపై ఎన్నిక లు.. ఇంకేం గొర్రెల నాయకుడు దండోరా వేయించాడు. మా పాలనలో అన్ని గొర్రెలకు ఉచితంగా కోటు పంపిణీ చేస్తానని. అన్ని గొర్రెలు ఖుషీగా పండుగ చేసుకున్నాయి. ఇలాంటి నాయకుడు దొ రకడం తమ అదృష్టమని పాలాభిషేకాలూ గట్రాలూ చేశాయి. అందులో కాసింత అమాయకంగా, అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న గొర్రెకు రాకూడని డౌట్ వచ్చింది..అడగకూడని ప్రశ్న ఆ నాయకుడిని అడిగింది. ‘మేం ఇంతమందిమి ఉన్నాం కదా.. అందరికీ అంత ఉన్ని ఎక్కడనుంచి తెస్తారూ ’.. అని. ‘‘ ఇంకెక్కడనుంచి గొర్రెల నుంచే తీస్తాం కదా..’’ నాయకుడి సమాధానం.
మగదోమ – నీకోసం సింహాన్ని వేటాడి తేనా డియర్
ఆడదోమ – వద్దులే ముందు పడుకో
మగదోమ – పోనీ ఐరావతాన్ని కుట్టి నీకు బ్లడ్ బాత్ చేయించనా
ఆడదోమ– వద్దు..వద్దు ముందు నిద్రపో, నాకూ నిద్ర వస్తోంది
మగదోమ – పోనీ ఇంకా ఏదైనా....
ఆడదోమ– అసలే ఓట్ల టైమ్.. రాజకీయ నా యకులను కుట్టి వచ్చావా ఏంటి... నోరుమూసుకు ని పడుకోకపోతే ఆల్ ఔట్ పెట్టి బయటకు పోతా..
ఇదో సైకాలజీ..
ఇలాంటి జోకులు, కథలు ఎన్నికల టైమ్‌లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇదంతా రాజకీయ నాయకులపై. ఎన్నికలపై, పోలింగ్‌పై వారి అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తుంటాయి. చాలామంది ఓటర్లు ఎన్నికల పట్ల నిరాసక్తంగా, పోలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. వీలుంటే పోలింగ్ తేదీని హాలిడేగా కూడా పరిగణిస్తుంటారు. పొలిటీషియన్లపై , ఎన్నికలపై మంచి అభిప్రాయం క్రమక్రమంగా కనుమరుగవుతోందని పై జోకులు చెబుతూనే ఉంటాయి. ఇలాంటి కథల వెనుక, ఓటు పట్ల నిరాసక్తత వెనుక సైకాలజీ కూడా ఉందట..అమెరికాలోని స్టోనీబ్రూక్, మిన్నెసోటా యూనివర్సిటీల పొలిటికల్ సైన్స్–ఎలక్షన్ సైకాలజీ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి ఇలా చెబుతున్నారు..
నిరాసక్త జీవులు..
♦ జీవితంలో కష్టానష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి సాయం దక్కనివారు ఓటేసేందుకు విముఖతతో ఉంటారు. తమకు లాభం లేదనుకున్నప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమిటన్న అభిప్రాయం వారిది.
♦ తోటివారిని పెద్దగా నమ్మనివారు, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడతారనే అభిప్రాయంతో ఉన్నవారు కూడా ఓటింగ్‌కు
దూరంగా ఉంటారట.
♦ పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోవడంతోనూ ఓటు వేయకుండా ఉండేవారూ ఎక్కువే. తమకు న చ్చిన అభ్యర్థి ఉన్నప్పుడే ఓటు వేయాలనిపిస్తుందని కొందరు ఓటర్లు ఓ సర్వేలో వెల్లడించారు.
♦ అభ్యర్థుల్లో ఎవరూ మంచివారు లేరని.. చెడ్డవారిలో ఎక్కువ, తక్కువ అంటూ ఎవరూ ఉండరనే అభిప్రాయంతో ఓటేయడం లేదని చెప్పినవారూ ఎందరో.
♦ కొందరైతే నిత్యం రాజకీయ వార్తలను చూస్తుంటారు. పార్టీలు, అభ్యర్థులపై చర్చలూ చేస్తారు. కానీ ఎన్నికల వ్యవస్థ రిగ్గింగ్‌కు గురైందనే, ఎవరు గెలుస్తారో ముందే తేలిపోయినట్టేననే భావనతో ఓటు వేయరు.
♦ గెలిచినవారు హామీలు నిలబెట్టుకోకపోవడం, డబ్బులున్నవారే గెలుస్తుండటం వంటివి కూడా జనం ఓటింగ్‌పై అనాసక్తికి కారణాలు
♦ ‘రాజకీయాలతో, నేతలతో మనకేం పని, నా పనేదో నాకుంది..’ అనుకునేవారు ఓటేసేందు కు వెళ్లరు. ముఖ్యంగా యువతలో ఇలాంటి భా వన కనిపిస్తుందని.. కెరీర్, చదువు, ఇతర వ్యా పకాల్లో మునిగి ఉండటంతో వారు నిత్యవార్తలకు, రాజకీయాలకు దూరంగా ఉంటుండట మే దీనికి కారణమని అధ్యయనం పేర్కొంది.
రాజకీయ జీవులు..
రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, రాజకీయాలు–ఎన్నికలు తమ నిత్యజీవితంపై ప్రభావం చూపుతాయన్న అవగాహన ఉన్నవారు క చ్చితంగా ఓటు వేస్తారని.. కొత్త అంశాలు, సంగతులపై ఆసక్తి ఉండేవారు ఓటు వేసే అవకాశాలు ఎక్కువని, దీనికి భిన్నంగా ఉండేవారు దూరంగా ఉంటారని తేల్చింది.
నిస్వార్థజీవులు..
ఎప్పుడో అరుదుగా తప్ప మామూలుగా అయితే ఒక ఓటు పడకపోతే, లేక అటూ ఇటూ అయితే వచ్చే తేడా ఏమీ ఉండదనే భావనలో కొందరు ఉండగా, గంటల తరబడి క్యూలో నిలుచుని మరీ ఓటు వేసేవారు కొందరు. మనుషుల్లో ఉండే నిస్వార్థమైన తత్వమే ఇలా ఓటు వేయడానికి కారణమని న్యూయార్క్ యూనివర్సిటీ సైకాలజీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
భారతీయుల బాధ..
♦ మేం ప్రభుత్వంపై, పథకాలపై ఆధారపడటం లేదనే భావనతో ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు ఓటు వేయడానికి దూరంగా ఉంటున్నాయి. తమకు ఏమైనా అవసరమైతే డబ్బుతోనో, పలుకుబడితోనో చేసుకోగలమనేది వారి భావన.
♦ సొంత ప్రాంతాలను వదిలి వలస వెళ్లినవారు.. కొత్త ప్రాంతాల్లో నేతలు, అభ్యర్థులపై ఆసక్తి లేకుండా ఉండటం, వారాంతాల్లో పోలింగ్ వల్ల ఓటేయడం కంటే వినోదంపై దృష్టిపెట్టడం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గుతోంది.
♦ భూస్వాములో, నేర చరిత్ర ఉన్నవారో, రాజకీయాలు తెలియని ప్రముఖులో ఎన్నికల బరిలోకి దిగినచోట మధ్యతరగతి, యువత వారిపట్ల ఏహ్యభావంతో ఓటేయడం లేదు. వేరేవారికి వేసినా గెలవరని భావిస్తున్నారు.
♦ రోతగా మారిన రాజకీయాలకు, నేతల అవినీతికి నిరసన అంటూ కొందరు ఓటు వేయకుండా ఉంటున్నారు.
♦ ఓటు ప్రాధాన్యత చాటి చెప్తూ సెలబ్రిటీలతో ఎన్నికల సంఘం చేస్తున్న ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని.. యువత పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేయడం లేదని పరిశీలకులు చెప్తున్నారు.
అమెరికాలోనూ అంతే..
పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలో జనం ఓటేయడంలో బద్ధకస్తులే. అక్కడ పేదలు, యువత, విదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారు పెద్దగా ఓటేసేందుకు ముందుకు రావడం లేదని అధ్యయనాల్లో తేలింది.
-సరికొండ చలపతి
Comments
Please login to add a commentAdd a comment