
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ఎల్లారెడ్డి: తాను కేంద్ర నీటి పారుదల మంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్ పదే పదే తన దగ్గరకు వచ్చారని... తెలంగాణ భవిష్యత్ కోసమని అనుమతులు ఇచ్చామని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తప్పు అని బ్యారేజీ కుంగుబాటుతో తేలిందని, భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దుస్థితిని చూస్తే దుఃఖం వస్తోందన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలలో బీజేపీ నిర్వహించిన సభల్లో గడ్కరీ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ ఎన్నో వనరులున్న రాష్ట్రం. ఇక్కడ అభివృద్ధికి, వికాసానికి ఎంతో అవకాశం ఉంది. కానీ ఇక్కడ అవినీతి, కుటుంబపాలన కొనసాగుతుండటం దురదృష్టకరం. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్‌ను తనకు అనుకూలంగా మార్చారు. రైతులకు ఉపయోగపడని వ్యర్థ ప్రాజెక్టుగా మార్చేశారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది. తెలంగాణ అభివృద్ధి, వికాసం కోసం పనిచేసే నిజాయతీ గల ప్రభుత్వం కావాలి. అది బీజేపీతోనే సాధ్యం.
ఒకనాడు పార్టీ నినాదాలను గోడలపై రాసే సామాన్య కార్యకర్తనైన నేను నేడు ఈ స్థాయికి ఎదిగాను. సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా మారగలడం కేవలం బీజేపీలోనే సాధ్యం. బీజేపీ సర్కారు చర్యలతో భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. దిగుమతులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. దేశ స్వరూపాన్ని, యువత భవిష్యత్‌ను మార్చేందుకు కృషి చేస్తున్నాం.
జోగుళాంబ–దేవరకొండ హైవేను పరిశీలిస్తాం
సోమశిలలో బ్రిడ్జి లేకపోవడంతో కిలోమీటర్ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి 80 కిలోమీటర్లు చుట్టూ వెళ్లాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రాంత అభివృద్ధి కోసం నూతన హైవే 167కె మంజూరు చేశాం. ఈ నూతన హైవేలో కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు వెళ్లొచ్చు. దీనికింద రూ.2,500 కోట్లతో మూడు ప్రాజెక్టులు చేపడుతున్నాం. సోమశిలలో ఐకాన్ బ్రిడ్జి ఏర్పాటవుతోంది. ఇక జోగుళాంబ శక్తిపీఠం నుంచి కొల్లాపూర్ మీదుగా దేవరకొండ వరకు మరో హైవే అడిగారు. దానిని పరిశీలిస్తాం. భూమి పూజ కోసం మళ్లీ ఇక్కడికి వస్తా.
కామారెడ్డి నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలకు..
తెలంగాణలోని పలు ప్రాంతాలను కామారెడ్డి జిల్లా మీదుగా మహారాష్ట్ర, కర్ణాటకలకు అనుసంధానించేలా హైవేలు నిర్మిస్తున్నాం. రూ3,304 కోట్లతో సంగారెడ్డి–నాందేడ్ ఎన్‌హెచ్ 161, రూ.1,100 కోట్లతో మద్నూర్–రుద్రూర్–భైంసా ఎన్‌హెచ్ 161బిబి, రూ.900 కోట్లతో మెదక్–ఎల్లారెడ్డి–రుద్రూర్ ఎన్‌హెచ్ 765డిని మంజూరు చేశాం. ఇందులో విస్తరణ పనులతోపాటు కొత్త హైవేలు కూడా ఉన్నాయి..’’ అని గడ్కరీ చెప్పారు.
రైతులు ఇంధన దాతలు కూడా..
ఇన్నాళ్లూ అన్నదాతగా ఉన్న రైతులు బీజేపీ ప్రభుత్వం స్థాపించబోయే బయో పరిశ్రమల ద్వారా ఇంధన దాతగా కూడా మారనున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు పలు రకాల ఉపాధి అవకాశాల కల్పనకు శాశ్వత ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. వరిపొట్టు ద్వారా ఎరువులను, విమాన ఇంధనాన్ని తయారుచేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేలా చూస్తాం.
Comments
Please login to add a commentAdd a comment