కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: గౌతమబుద్ధనగర్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు
ఓటు బ్యాంక్‌లో తేడాలు వస్తే లాభపడేదెవరు? నష్టపోయేదెవరు? ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన పశ్చిమ ప్రాంతంపైనే ఈసారి అన్ని పార్టీల గురి... మతకల్లోలాలు, ఉద్రిక్తతలే ఆసరాగా ఆ ప్రాంతంలో ఓటు బ్యాంకు పెంచుకున్న కమలనాథులు హిందువులతో పాటు ఓబీసీలు, దళితులు కూడా బీజేపీ వైపు మళ్లించుకొని 2017లో అధికారపీఠాన్ని అందుకున్నారు. ఈసారి బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం.. క్షేత్రస్థాయిలో బీజేపీ వ్యూహాలు ఫలించడం లేదనే అభిప్రాయం హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య వాతావరణం... దారి చూపిన రైతు పోరుబాట ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమికి గణనీయంగా ఓట్ల బదిలీ జరుగుతుందంటున్న విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఇక్కడ నామమాత్రమే.. ఈ నేపథ్యంలో యూపీకి దిక్సూచిగా నిలిచే పశ్చిమాన ఎవరికి మెజారిటీ వస్తే... వారికే లక్నో పీఠం దక్కేది!
ఉత్తరప్రదేశ్‌లో పార్టీల గెలుపోటములను నిర్ణయించే జాట్‌లు, ముస్లింలు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గడచిన శాననసభ ఎన్నికల్లో మెజారిటీ జాట్ కులస్తులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు పలికారు. ముస్లింల ఓట్లను సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) పంచుకున్నాయి. మొదటి రెండు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో జాట్‌లు, ముస్లింలదే నిర్ణయాత్మక పాత్ర. గడచిన ఎన్నికల్లో 50 శాతంకు పైగా జాట్‌లు బీజేపీకి మద్దతు పలికితే, మిగిలిన 50 శాతం ఓట్లు అన్ని పార్టీలు పంచుకున్నాయి. ఇక ముస్లిం ఓటర్లలో 60 శాతం మంది ఎస్‌పీకి, 30 శాతం మంది బీఎస్పీకి ఓటేయగా మిగిలిన 10 శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు పలికారు.
జరగబోయే ఎన్నికల్లో ఈ పరిస్థితి తారుమారవుతుందని ప్రముఖ సర్వే సంస్థలతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఓట్లేసిన జాట్‌లలో 25 శాతం మంది ఈసారి ఓటేయకపోతే బీజేపీకి మొత్తం ఐదు శాతం మేర ఓట్లు తగ్గుతాయి. గతంలో బీఎప్పీకి ఓట్లేసిన ముస్లింలలో 15 శాతం మంది ఈసారి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ మేరకు ఆ ఓట్లు ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ కూటమికి బదిలీ అయితే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఈ రెండు విశ్లేషణలను పరిశీలిస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాంప్రదాయ ఓటుకు ఈ ఎన్నికలలో గండి పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుల మతాలతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులు ఆ పార్టీకి దూరమైన కారణంగా ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కోనున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ యూపీలో ఎస్పీ, బీఎస్పీల కంటే బీజేపీ సాంప్రదాయ ఓటు ఎక్కువ. 1991 నుంచి గణాంకాలను పరిశీలిస్తే బీజేపీకి సగటున 34, ఎస్పీకి 29, బీఎస్పీకి 21 శాతం ఓట్లు లభిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 42.6 శాతం ఓట్లతో ఏకంగా 71 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్ దీనికి గణనీయంగా దోహదపడింది. ఆగ్రా, అలీఘర్, మీరట్, ముజఫర్‌నగర్, ఫిరోజాబాద్, ఘజియాబాద్, మీరట్ తదితర ప్రాంతాల్లోని 20 లోక్‌సభ స్థానాలు కమలదళం గెలుచుకుంది. గడచిన శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈ ప్రాంతంలో 83 స్థానాలను కైవసం చేసుకుంది.
ఈసారి పరిస్థితి ఏమిటి?
మొదటి రెండు దశల్లోనే పశ్చిమ యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి ఇక్కడ మొత్తం ఉన్నవి 78 సీట్లే. అయితే తొలి రెండు విడతల్లో కలిపితే... 113 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల విజయంపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న బిజ్నౌర్ ప్రాంతంతో కలుపుకుంటే మొత్తం 113 స్థానాలకు గాను 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 91 చోట్ల బీజేపీ, 17 స్థానాల్లో ఎస్పీ విజయం సాధింంచగా, బీఎస్పీ, కాంగ్రెస్‌లు రెండు స్థానాల చొప్పున, ఆర్‌ఎల్డీ ఒక చోట గెలుపొందాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి 5, బీఎస్పీ నుంచి 10 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే పశ్చిమ యుపీలో ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి 60 నుంచి 70 శాతం సీట్లు సాధించే అవకాశం ఉన్నదని సీఎస్‌డీఎస్ సర్వే నిపుణుడు ప్రభాత్ కుమార్ అంచనా వేశారు. (క్లిక్: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం)
గత ఎన్నికల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన 50 శాతం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. మిగిలిన 50 శాతం మంది జాట్‌లు అన్ని పార్టీలకు మద్దతిచ్చారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కారణంగా 25 శాతం మంది జాట్లు బీజేపీకి దూరమైనా ఆ పార్టీ ఓటు బ్యాంకులో కనీసం 5 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయి. అదే జరిగితే కనీసం 25 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అక్కడ కోల్పోనుంది. అదే సమయంలో ఎస్పీ కూటమికి 29 సీట్లు పెరగనున్నాయి.
ఇక, బీఎస్పీ ఓటు బ్యాంకుగా చెప్పుకునే 21 శాతం ఓట్లలో బీజేపీ, ఎస్పీ కూటమికి ఎంత బదిలీ అవుతుందన్నది కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. బీఎస్పీ ఓటు బ్యాంకు 5–10 శాతం ఎస్పీ కూటమికి బదిలీ అవుతుందనే అంచనా మేరకు ఎస్పీ కూటమి భారీగా లాభపడనుందని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. ఇక, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పేరిట కూడా అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఇవి కూడా యోగి నేతృత్వంలోని బీజేపీ, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ కూటముల మధ్య పెద్ద అంతరం లేదని, ఈసారి తీవ్ర పోటీ తప్పదని అంచనా వేస్తున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య లాంటి కీలక ఓబీసీ నేతల రాక కూడా సమాజ్‌వాదీ శిబిరానికి అదనపు బలం కానుంది.
రైతాంగ పోరాటంతో ఏకతాటిపైకి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు జరిగిన రైతాంగ ఉద్యమం బీజేపీ రాజకీయ వ్యూహాలను కుదిపేస్తోంది. కుల, మతాలలో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులను ఈ ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ‘హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని కూడా ఈ ఉద్యమం తీసుకు రాగలిగింది’ అని మీరట్ కు చెందిన హిందూ–ముస్లిం సమభావన సమితి కార్యదర్శి మహమ్మద్ అలియా భట్ అన్నారు. దీనికి తోడు పశ్చిమ యూపీలో శాంతియుత వాతావరణం కోసం ఆర్ ఎల్డీ నిర్వహించే ‘భాయ్ చరా’ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఆ పార్టీ అధినేత దివంగత అజిత్ సింగ్ ఇలాంటి సమావేశాలు ఎన్నో నిర్వహించారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణానంతరం సమాజ్ వాదీ నాయకురాలు తబస్సుమ్ బేగంను ఆర్‌ఎల్డీ అభ్యర్థిగా కైరానా లోక్ సభ నుంచి బరిలో దింపి విజయ తీరాన్ని చేర్చింది కూడా ఈ సమావేశాలతోనే. అజిత్ సింగ్ మరణానంతరం ఆయన కుమారుడు జయంత్ కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!)
హిందూ ఓటు బ్యాంక్ తమదేనన్న ధీమా!
కానీ, కమలదళం మాత్రం హిందువుల ఓటు బ్యాంకు తమదేనన్న ధీమాతో ఉంది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూనే ఆ చట్టాలు రద్దు చేసినందున వ్యతిరేకత తగ్గిపోయిందని ప్రచారం చేస్తోంది. యుపీలో రైతాంగానికి 50 శాతం విద్యుత్ బిల్లుల తగ్గింపు తమకు మేలు చేస్తుందని, ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటామని కేంద్ర మంత్రి సంజీవ్ ధీమా వ్యక్తం చేశారు. ముజఫర్ నగర్‌లో ప్రచారం చేస్తున్న ఆయన సాక్షి ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమిని నీటి బుడగగా అభివర్ణించారు. అంతే కాదు బీజేపీ ఈసారి కూడా హిందూ ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే వ్యూహానికే పదును పెడుతోంది. అందులో భాగంగానే కైరానా నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా ’పలాయన్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ముజఫర్ నగర్ ఘర్షణల్లో వలస వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబాలను కలిసి పరామర్శించారు. అంతే కాదు యోగి పాలనలో శాంతి భద్రతలు మెరుగు పడినందునే ఈ ప్రాంత ప్రజలు శాంతి యుతంగా జీవించగలుగుతున్నారని కితాబునిచ్చారు కూడా. అయితే, ఈ కితాబులు, కమల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి..? గత రెండు, మూడు ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలుస్తున్న పశ్చిమ యూపీ గ్రామీణ, సెమీ అర్బన్ ఓటరు ఈసారి ఏం చేస్తాడు? కమల వికాసానికి తోడ్పడుతాడా? ఏనుగు దిగి, హ్యాండిచ్చి మరీ సైకిల్ ఎక్కుతాడా? ముజఫర్‌నగర్ నుంచి మీరట్ వరకు ఓటరన్న ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతాడన్నది ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు దేశ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం)
క్షేత్రస్థాయిలో పని చేయని బీజేపీ వ్యూహాలు
ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నట్టు కనిపించడం లేదు. విభజన రాజకీయాలను తాము గ్రహించగలిగామని, మళ్లీ ఆ ఉచ్చులో పడబోమనే నినాదం ఇక్కడి స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఈ అంశంలో తమ పాచికలు పారడం లేదని గ్రహించిన కేంద్ర మంత్రి, కైరానా ఎంపీ సంజీవ్ బలియాన్ ఇప్పుడు ముస్లిం సానుభూతిపరుడిగా మారిపోయారు. ముజఫర్ నగర్ లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క చోట కూడా ఎస్పీ, ఆర్‌ఎల్డీలు ముస్లిం అభ్యర్థులను ఎందుకు నిలబెట్టడం లేదంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ రాజకీయ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు స్థానిక ముస్లింలు సహన పరీక్ష ఎదుర్కొనవలసి వస్తోందని ఇమామ్‌ల సంఘం నేతలంటున్నారంటే పశ్చిమ యూపీలో మారిన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. రైతు ఉద్యమకారుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఏర్పాటు చేసిన బీకేయూ కూడా మత సామరస్యం కోసం పని చేస్తూ గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చింది. ‘ఈసారి గతంలో మాదిరి తప్పులు చేయం. మా భవిష్యత్ ఏమిటో మాకు తెలిసివచ్చింది’ అని మహేంద్ర సింగ్ కుమారులు రాకేశ్, నరేశ్ తికాయత్‌లు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. (క్లిక్: యోగీకి కలిసొచ్చే, సవాల్ విసిరే అంశాలివే!)
Comments
Please login to add a commentAdd a comment