ఢిల్లీ: 18వ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం రాష్ట్రపతిని ‘రాజ దండం’తో ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ప్రధని మోదీ పార్లమెంట్‌లోకి స్వాగతం పలికారు. అయితే లోక్‌సభలో రాజ దండాన్ని స్పీకర్ చైర్ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కే చౌదరీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
‘దేశంలో ప్రజాస్వామ్యంలో కోసం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక చిహ్నం.బీజేపీ గత ప్రభుత్వంలో రాజదండాన్ని స్పీకర్ చైర్‌కు పక్కన గోడకు అమర్చారు. సెంగోల్ అనే తమిళ పదం నుంచి వచ్చింది. సెంగోల్ అర్థం దండం. రాజదండం అంటే రాజు చేతి కర్ర.
మనం రాజరిక పాలన నుంచి ఎప్పుడో విముక్తులం అయ్యాము. ప్రస్తుతం ఓటు అర్హత కలిగి ఉన్న స్త్రీ,పరుషులు ఓటువేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. దేశంలో పాలన రాజ్యాంగంతో నడవాలా? లేదా రాజదండంతో నడవాలా?. రాజదండం స్థానంలో రాజ్యాంగాన్ని అమర్చి.. రాజ్యాంగాన్ని రక్షించండి’ అని ఆయన స్పీకర్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు.
సెంగోల్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘సమాజ్‌వాదీ పార్టీ గతంలో రామచరిత్‌మానస్‌పై విమర్శలు గుప్పించింది. ఇప్పుడు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తమిళ సంస్కృతిలో భాగమైన సెంగోల్‌పై విమర్శలు చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ సెంగోల్‌ను అవమానించడాన్ని డీఎంకే పార్టీ సమర్థిస్తుందో? లేదో? స్పష్టం చేయాలి’ అని విపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment