చిలకలూరిపేట: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారు? ఇప్పుడు ఎంత మంది బీసీలు మంత్రులుగా ఉన్నారో.. లోకేశ్ చెప్పాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు. బీసీల బాగోగులు లోకేశ్‌కు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టుందని, లోకేశ్‌కు దమ్ముంటే.. బీసీల కోసం సీఎం జగన్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఎత్తేస్తా అని చెప్పగలడా అంటూ సవాల్ విసిరారు.
జగనన్న నలుగురు బీసీలకు ఏకంగా రాజ్యసభ సీట్లు ఇచ్చారని, ఇలా చేయకూడదు అని లోకేశ్ అనగలడా.. అని ప్రశ్నించారు. ఏకంగా 11 మంది బీసీలను సీఎం జగన్ మంత్రులను చేశారని, ఇది తప్పు.. ఇలా నేను చేయను.. అని లోకేశ్ చెప్పగలడా.. అని ప్రశ్నించారు. చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ లోకేశ్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబే పెద్ద కటింగ్, ఫిటింగ్ మాస్టర్
చంద్రబాబును మించిన కటింగ్, ఫిటింగ్ మాస్టర్ దేశంలోనే ఎక్కడా లేరని మంత్రి విమర్శించారు. పల్నాడు జిల్లా పాదయాత్రలో భాగంగా లోకేశ్ మాట్లాడిన మాటలు అతడి మానసిక దుస్థితికి అద్దం పడుతున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. పదే పదే రెడ్‌బుక్‌లో పేరు నమోదు చేస్తా.. అంటూ అధికారులను, ప్రజలను లోకేశ్ బెదిరిస్తున్నాడని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణమవుతుందన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ఒంటిచేత్తో గెలిపించుకుని సీఎం అయిన జగనన్నను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్‌కు విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
లోకేశ్ కటింగ్.. ఫిటింగ్ అంటూ మాట్లాడుతున్నాడని, రైతులకు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి, దానిని తుంగలో తొక్కిన చరిత్ర చంద్రబాబుదని, అసలైన కటింగ్, ఫిటింగ్ అంటే ఇదేనని మంత్రి ఎద్దేవా చేశారు. పల్నాడులో సున్నపురాయిని దోచుకుతిన్నది టీడీపీ నేతలేనని రజిని మండిపడ్డారు. సున్నపురాయి క్వారీల్లో టీడీపీ నేతలు చేసిన అక్రమ మైనింగ్ ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు.
వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఆయనకు దమ్ముంటే ముందు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ములేని వారు వైనాట్ పులివెందుల అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment