విడపనకల్లు/రాయదుర్గం/దేవరాపల్లి/కొయ్యలగూడెం/వలివేరు: తాము సమ్మెలోకి వెళ్తున్నామంటూ తప్పుడు రాతలు రాసిన ఎల్లో మీడియాపై వలంటీర్లు కన్నెర్ర చేశారు. తప్పుడు వార్తలు రాయవద్దని హెచ్చరిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేశారు. తమతో సమ్మె చేయించాలన్న ఎల్లోమీడియా కుట్రలు సాగవని చెప్పారు. తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లులో అవాస్తవ కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను తగులబెట్టారు.
ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు హేమంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటివద్దకే చేరేవిధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారని చెప్పారు. సీఎం ఏ ఉద్దేశంతో అయితే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారో.. తామంతా అందుకు అనుగుణంగానే ప్రభుత్వానికి విధేయులుగా పనిచేస్తున్నామని తెలిపారు. కానీ ఎల్లోమీడియా తమకు లేనిపోనివి ఆపాదించి కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో పత్రికలకున్న విలువను పోగొట్టుకుంటున్నాయని చెప్పారు.
రాయదుర్గంలో వలంటీర్ల సంఘం నాయకులు జబివుల్లా, సునీల్, వంశీ, ప్రవీణ్, జునీయాద్‌బాష తదితరులు మీడియాతో మాట్లాడుతూ వలంటీర్లు సమ్మె చేస్తారంటూ ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. తమను వేగులని, సంఘవిద్రోహ శక్తులని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ అన్నారని, ఆ వ్యాఖ్యల్ని ఈ పచ్చపత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయని గుర్తుచేశారు. గతంలో తమపై అంతలా విషం చిమ్మిన పత్రికలు ఇప్పుడు కొందరితోనైనా సమ్మె చేయించాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. కానీ ఆరునూరైనా వారి పాచిక పారదని చెప్పారు.
తప్పుడు రాతలు మానుకోవాలంటూ నినాదాలు
వలంటీర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారంటూ అసత్య కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై అనకాపల్లి జిల్లా దేవరాపల్లి గ్రామ సచివాలయం–1, 2 పరిధిలోని వలంటీర్లు నిరసన తెలిపారు. సేవాభావంతో పనిచేస్తున్న తమపై విషప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మరోసారి తప్పుడు రాతలు ప్రచురిస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
మండల కేంద్రం దేవరాపల్లిలో ఈనాడు పత్రికలు చేతపట్టి పచ్చమీడియాకు వ్యతిరేకంగా ‘ఈనాడు డౌన్‌డౌన్, తప్పుడు రాతలు మానుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. దేవరాపల్లి ప్రధాన రోడ్డులో పచ్చ పత్రికలను దహనం చేశారు. వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పనచేసి తమకు సేవచేసే భాగ్యాన్ని కల్పించిన సీఎం జగన్ అంటే తమకెంతో గౌరవభావం ఉందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని దేముళ్లు, పోతురాజు, జోష్, ఉమ, దేవి, రాజు, ఎర్రినాయుడు స్పష్టం చేశారు.
సమ్మె చేయం
బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామ సచివాలయం వద్ద గురువారం వలంటీర్లు ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సమ్మె చేయకుండా చేస్తున్నారని ఈనాడు పేపరులో రాయడం దారుణంగా ఉందని చెప్పారు. ప్రజలకు సేవచేసేందుకే గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ సమ్మె చేయబోమని వలంటీర్లు స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పచ్చ పత్రికలు
పచ్చ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని, మీడియా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ సచివాలయం వద్ద వలంటీర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వలంటీర్ల అసోసియేషన్ నాయకుడు జొన్నకూటి పట్టియ్య ఆధ్వర్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి డైలీ పేపర్లతో దిష్టిబొమ్మను తయారుచేసి దహనం చేశారు. తాము విధులకు హాజరై బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అసత్య కథనాలతో తమపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను దేశమంతా కొనియాడుతుంటే అంపశయ్యపై ఉన్న తెలుగుదేశం, దాని తోకపార్టీ జనసేనను అధికారంలోకి తీసుకురావడానికి రామోజీ, రాధాకృష్ణ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల ఐక్యత వర్థిల్లాలని, పచ్చ పత్రికల నీతిమాలిన రాతలు మానుకోవాలని నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment