అట్టహాసంగా పోలీసు క్రీడాపోటీలు ప్రారంభం
● ఏడేళ్ల అనంతరం జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలు ● మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయం ● ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ● ఉత్సాహంగా రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ● 20 జోన్ల నుంచి 2,380మంది క్రీడాకారులు హాజరు
కరీంనగర్‌స్పోర్ట్స్/కరీంనగర్‌టౌన్: రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీలు కరీంనగర్‌లోని పరేడ్ మైదానంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్లో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు జరగడం అనందంగా ఉందన్నారు. ఆలిండియా పోలీస్ క్రీడోత్సవాల్లో తెలంగాణ జట్లు పతకాల పంట పండించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో ఆదిలాబాద్‌లో, 2017లో వరంగల్‌లో పోటీలు జరగ్గా.. ఇప్పుడు కరీంనగర్లో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. పోటీల్లో సుమారు 2,380మంది క్రీడాకారులు పాల్గొనడం, అందులో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరం అన్నారు. పోటీలకు ఘనంగా ఏర్పాట్లు చేసిన పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని అభినందించారు. ఐజీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటేనే ఎంతో ఒత్తిడితో ఉండే ఉద్యోగం అని ఇలాంటి పోటీలతో ఉపశమనం కలుగుతుందన్నారు. ఐజీ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా విభజన అనంతరం అట్టహాసంగా పోటీలు జరుగుతున్నాయన్నారు. అనంతరం క్రీడాకారుల మార్చ్ఫాస్ట్, గౌరవ వందనం స్వీకరించారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఇండియన్ నేషనల్ గేమ్స్ తరహాలో మార్చ్ఫాస్ట్ ఘనంగా సాగింది. రాష్ట్రంలోని 20 జోన్లకు చెందిన క్రీడాకారులు రంగురంగుల క్రీడాదుస్తులతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలించారు. తొలుత కాళేశ్వరం జోన్ జట్టు మార్చ్ఫాస్ట్ చేయగా చివరగా ఆతిథ్య రాజన్న జోన్ జట్టు చేసింది. అనంతరం తెలంగాణ పోలీస్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ అధికారులు వసుంధర, మాధవి రూపొందించిన స్పోర్ట్స్ అంథమ్ సీడీని ఆవిష్కరించారు. కాళేశ్వరం, ఇంటెలిజెన్స్ జోన్ జట్ల మధ్య జరిగిన సాకర్ మ్యాచ్‌తో తొలిరోజు వేడుకలు ముగిశాయి. కరీంనగర్, రామగుండం సీపీలు అభిషేక్ మహంతి, శ్రీనివాసులు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు అఖిల్ మహాజన్, అశోక్ కుమార్, శిక్షణ ఐపీఎస్ వసుంధర యాదవ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment