మానేరు తీరం.. భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

మానేరు తీరం.. భక్తజన సంద్రం

Published Thu, Jan 30 2025 12:11 AM | Last Updated on Thu, Jan 30 2025 12:11 AM

-

సిరిసిల్లలో రామలింగేశ్వర స్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తులు

పులకించిన సిరిసిల్ల కార్మికక్షేత్రం మూడు జాతర్లతో ఉప్పొంగిన భక్తి పారవశ్యం

లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం నేత్రపర్వంగా స్వామివార్ల కల్యాణోత్సవం

సిరిసిల్లటౌన్‌: మానేరు తీరం భక్తజన సంద్రమైంది. సిరిసిల్ల కార్మికక్షేత్రం బుధవారం భక్తకోటితో పరవశించి పోయింది. మాఘ అమావాస్య పుణ్యదినాన ఇసుకేస్తే రాలనంత జన సందోహం మధ్య మూడు జాత ర్లు వైభవంగా జరిగాయి. సిరిసిల్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల జనాలు తరలివచ్చి స్వామి వార్ల కల్యాణోత్సవాలను తిలకించారు. మానేరు తీరన గంగపుత్రుల ఆధ్వర్యంలో గంగాభవానీ, నాయీబ్రహ్మణుల ఆధ్వర్యంలో రామలింగేశ్వరస్వామి, రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వరస్వామి కల్యాణోత్సవం, జాతర వైభవంగా జరిగింది. లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యారు. మహిళలు గంగామాత, శివపార్వతులకు ఒడిబియ్యం సమర్పించారు. కట్నకానుకలు చదివించారు. మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయిన ప్రాచీన శైవక్షేత్రం రామప్ప ఆలయంలో జరగాల్సిన కల్యాణోత్సవం ప్రభుత్వం కేటాయించిన సమీపస్థలంలో నిర్వహించారు. జాతర్లకు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, టౌన్‌ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, ఏంఎసీ చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపరెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, సంగీతం శ్రీనివాస్‌ తదితరులు స్వామివార్లను దర్శించుకున్నారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వెంగల కనుకయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు దండు శ్రీనివాస్‌, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కొత్వాల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement