మండలి కోడ్ కూసింది
● పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు షెడ్యూల్ విడుదల ● వచ్చేనెల 3న నోటిఫికేషన్, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ● మార్చి 8న పూర్తికానున్న ఎన్నికల ప్రక్రియ ● పకడ్బందీగా కోడ్ అమలు చేయాలి: కలెక్టర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
శాసనమండలిలో త్వరలో ఖాళీ కానున్న టీచర్స్, ఉమ్మడి కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారంఎన్ని కల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో కోడ్ అమల్లోకి వచ్చింది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రారంభోత్సవాలను అధికార పార్టీ నాయకులు వాయిదా వేసుకున్నారు. ఆయా పార్టీల నాయకులు, స్వతంత్రులు ప్రచార వేడిని పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుండగా.. మార్చి 8వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
సింహభాగం ఇక్కడే..
ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు, టీచర్ల సింహభాగం ఓట్లు ఇక్కడే ఉన్నాయి. గతేడాది డిసెంబరు 30 వరకు 3.41లక్షల పట్టభద్రుల ఓట్లు ఉండగా, కరీంనగర్లో దాదాపు 1.55 లక్షలకుపైగా ఓట్లున్నాయి. టీచర్ల ఓట్ల విషయానికి వస్తే.. మొత్తం 25,921 ఓట్లు ఉండగా.. 7,659 ఓట్లు కరీంనగర్లో ఉన్నాయి. అందుకే, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఉమ్మడి జిల్లాపైనే దృష్టి కేంద్రీకరించారు. మిగిలిన మూడు జిల్లాల్లో ప్రచారం చేస్తూనే.. కరీంనగర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి వచ్చేనెల మూడో తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం మరోసారి అవకాశం ఇవ్వగా.. 3,251 గ్రాడ్యుయేట్లు, 676 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు.
తక్షణమే కోడ్ అమల్లోకి: కలెక్టర్ పమేలా సత్పతి
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు వంటివి తొలగించాలన్నారు. బస్టాండ్, పబ్లిక్ పార్క్ వంటి ప్రజలు సందర్శించే చోట్లలో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టిక్కర్లు, గోడలపై రాతలు తీసివేయాలని, విగ్రహాలను కవర్ చేయాలన్నారు. సరైన పత్రాలు లేకుండా రూ.50 వేల కన్నా ఎక్కువ నగదును తరలిస్తే సీజ్ చేయాలని అన్నారు.
పెరగనున్న ప్రచార వేడి
నోటిఫికేషన్ వచ్చిన దరిమిలా అభ్యర్థులు ప్రచారం వేగం పెంచనున్నారు. అదే సమయంలో ఎవరు బరిలో ఉంటారు? ఎవరు తప్పుకోనున్నారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆశావహుల్లో మొన్నటిదాకా ప్రచారం చేసిన సగంమందిలో ఇప్పటికే తప్పుకుంటారన్న ప్రచారం జోరందుకుంది. అన్న విషయంపైనా త్వరలోనే స్పష్టత రానుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ పోటీ పడుతున్నారు. ఇక బీఆర్ ఎస్ నుంచి మాజీ మేయర్సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్‌రావు, డా.బీఎన్ రావు, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ బరిలో మానేరు విద్యా సంస్థల కడారు అనంత్‌రెడ్డి, పీఆర్టీయూ బలపరిచిన వంగా మహేందర్ రెడ్డి, బీజేపీ అనుబంధ తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయం సంఘం (తపస్) తరఫున మల్క కొమురయ్య, ఎస్జీటీయూ నుంచి సంకినేని మాధవరావు బరిలో ఉన్నారు.
పట్టభద్రుల కొత్త ఓటర్ల వివరాలు
కరీంనగర్ 1,380
జగిత్యాల 562
పెద్దపల్లి 722
రాజన్న సిరిసిల్ల 587
మొత్తం 3,251
షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల 03–02–2025
నామినేషన్ల చివరితేదీ 10–02–2025
స్క్రూటినీ 11–02–2025
విత్‌డ్రాలకు చివరితేదీ 13–02–2025
పోలింగ్ తేదీ 27–02–2025
ఓట్ల లెక్కింపు 03–03–2025
ఎన్నికల ప్రక్రియపూర్తి 08–03–2025
Comments
Please login to add a commentAdd a comment