తప్పు చేస్తే ‘తడిపార్’
సిరిసిల్లక్రైం: నేరస్తులు గతంలో ఉన్న నేరచరిత్రను ఓ డిగ్రీ, పీజీ పట్టాల మాదిరిగా ఫీలవుతూ యథేచ్ఛగా భూమి, సివిల్ తగాదాల్లో తలదూర్చి అమాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇటీవల వేములవాడ డివిజన్ పరిధిలో ఓ రౌడీషీటర్ తనకున్న నేర చరిత్రను ఒక హోదాగా చెప్పుకుని బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే దానిపై పోలీసులు స్పందించారు. ఇద్దరిని కటకటాలకు పంపారు. కాగా, జిల్లాలో శాంతిభద్రతల విఘాతంలో మళ్లీ పాత నేరస్తుల పాత్ర ఉందని గమనించారో ఏమో కానీ పోలీసు బాస్ సీరియస్ అయ్యారు. తప్పు చేస్తే తాట తీస్తాం. అప్పటికీ మార్పు రాకుంటే జిల్లా నుంచి తడిపార్ (వెలివేయడం) చేస్తామని వెల్లడించడంతో జిల్లాలో పోలీసుల దూకుడుపై చర్చ ప్రారంభమైంది.
మారకుంటే జిల్లా నుంచి వెలి
నేరాలు చేసినవారు సామాన్యులుగా రావాలని, అలా కాకుండా పాత విధానాన్ని కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసు బాస్ వెల్లడించాడు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో నేరస్తులుగా ఉండి షీట్లలో పేరున్న వారందరితో రెండు రోజు క్రితం ఎస్పీ సమావేశం నిర్వహించారు. భూమి విషయంలో హత్య చేసి జైలు జీవితం గడిపిన ఓ రౌడీషీటర్ మళ్లీ సివిల్ తగాదాల్లో తలదూర్చి మధ్యవర్తితో బెదిరింపులకు పాల్పడ్డాడని, ఇలాంటివి మళ్లీ జరిగితే జిల్లా నుంచి వెలివేసేలా కఠిన చర్యలకు వెళ్తామన్నారు. మారినవారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కౌన్సెలింగ్ ఇచ్చారు. గతంలో తప్పు చేసి జైలుకు వెళ్లి, మళ్లీ వక్రమార్గంలో జీవనం సాగిస్తామంటే కుదరదని వెల్లడించారు. చిన్న తప్పులు చేసినా సాంకేతిక పరిజ్ఞానంతో వాటి సాక్ష్యాలు చక్కగా దొరుకుతున్నాయని, నేరస్తులకు శిక్ష తప్పదన్నారు. మద్యం తాగి బైక్ నడిపితే గతంలో జరిమానా ఉండేదని, ప్రస్తుతం అలాంటి కేసులకు జైలు శిక్ష పడుతున్న సందర్భాలను గుర్తు చేశారు. మారితే అందరికీ మంచిదని, సత్ప్రవర్తన కలిగిన వారిపై ఉన్న షీట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తామని కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా, రౌడీషీటర్‌గా ఉండి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జిల్లా కేంద్రానికి చెందిన మోయిజ్పై జిల్లా బహిష్కరణ వేటు వేస్తూ టౌన్ సీఐ కృష్ణ మంగళవారం నోటీసులు జారీ చేశారు.
నేర ప్రవృత్తిపై నిఘా కఠినం మారకుంటే జిల్లా దాటిస్తాం రౌడీషీటర్లకు పోలీస్ బాస్ హెచ్చరిక జిల్లాలో రౌడీషీటర్లు 139.. హిస్టరీ షీటర్లు 422
Comments
Please login to add a commentAdd a comment