నత్తనడకన ఎల్‌ఆర్‌ఎస్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అనధికారిక లే అవుట్లు, వాటిలోని ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కలెక్టర్ ఇప్పటికే సంబంధిత అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, ప్రక్రియను వేగవంతం చేయా లని ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్ర స్థాయిలోని టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. ఖాళీ ప్లాట్లు/ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ జారీ చేసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు రూ.పది వేలు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.వెయ్యి ఫీజుగా నిర్ణయించింది. ఆ మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జోన్లలో 3,58,464 దరఖాస్తులు రాగా, రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల పరిధి నుంచి అత్యధికంగా 2,37,259 దరఖాస్తులు అందాయి. 549 గ్రామ పంచాయతీల నుంచి 46,430 దరఖాస్తులు వచ్చాయి. మూడు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీల పరిధిలో 46, పంచాయతీల పరిధిలో 18 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో 7,023 దరఖాస్తులు క్లియర్ చేయగా, గ్రామ పంచాయతీల్లో కేవలం ఆరు మాత్రమే క్లియర్ చేసినట్లు సమాచారం. మిగిలిన దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
అధికారులకు సవాల్
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు.. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలలైనా ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకు లోన్ల కోసం వెళ్లాలని భావించే దరఖాస్తుదారులకు నిరాశే మిగులుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొంత మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు అడిగినంత ముట్టజెప్పి.. తమ దరఖాస్తులను క్లియర్ చేయించుకుంటుండగా, ఇచ్చేందుకు నిరాకరించిన వారికి మరింత కాలం నిరీక్షణ తప్పడం లేదు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన పోర్టల్ సర్వర్ తరచూ మొరాయిస్తుండటం.. క్షేత్రస్థాయి సిబ్బంది పోర్ట ల్‌లో లాగినై.. అన్ని వివరాలను నమోదు చేసి, తీరా సబ్మిట్ బటన్ నొక్కితే.. ఫీజు చెల్లింపులు, రసీదులు, ప్రొసీడింగ్‌ల జారీ వంటి ప్రక్రియ పూర్తికాక పోగా మళ్లీ మొదటికొస్తుండటంతో ఏం చేయాలో అర్థంకాక ఆయా బృందాలు తల పట్టుకుంటున్నాయి. ఇప్పటికే అక్రమ నిర్మాణాల గుర్తింపు, కూల్చివేతలు, కొత్త భవనాలకు అను మతుల జారీ, ఇంటి పన్ను నిర్ధారణ, వసూళ్లు వంటి ప్రక్రియతో బిజీగా ఉన్న టౌన్‌ప్లానింగ్ అధికారులకు వేలల్లో పేరుకుపోయిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన సవాల్‌గా మారింది.
ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో 7,023, పంచాయతీల్లో ఆరు అర్జీలే పరిశీలన
వేలల్లో పేరుకుపోయిన దరఖాస్తులు
దరఖాస్తుదారులకు తప్పని నిరీక్షణ
వాటి ఆమోదం కోసం ఒత్తిడి
ఆదిబట్ల మున్సిపాలిటీలో 14,892, ఆమనగల్లు 3,561, ఇబ్రహీంపట్నం 15,345, జల్‌పల్లి 10,892, కొత్తూరు 3,956, మణికొండ 2,591, నార్సింగి 3,354, పెద్ద అంబర్‌పేట్ 43,459, షాద్‌నగర్ 15,466, శంషాబాద్ 96,791, శంకర్‌పల్లి 4,720, తుక్కుగూడ 2,541, తుర్కయంజాల్ 49,686, బడంగ్‌పేట్ 47,790, బండ్లగూడ జాగీర్ 7,753, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 3,412 అర్జీలు అందాయి. అదేవిధంగా ఫరూఖ్‌నగర్ మండలంలో 22,051, కేశంపేట 10,200, తలకొండపల్లి 2,323, యాచారం 4,464, కడ్తాల్ 3,513, కొందుర్గు 1,505, ఆమనగల్లు మండలంలో 929, మాడ్గుల 708, జిల్లెడు చౌదరిగూడెం 683, మంచాల నుంచి 54 వినతులు అందాయి. వచ్చిన దరఖాస్తుల్లో 35,837 నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వీటి ఆమోదం కోసం రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు మొదలైనట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment