సర్వే సాగక
సిబ్బంది లేక..
ఇటు రహదారులు.. అటు చెరువులు
● రెండు మండలాలకు ఒక సర్వేయర్
● జిల్లాలో వేధిస్తున్న సిబ్బంది కొరత
● 2,500 పైగా దరఖాస్తులు పెండింగ్
● భూ బాధితులకు తప్పని నిరీక్షణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో భూ క్రయ, విక్రయాలే కాదు విస్తీర్ణం, సరిహద్దు వివాదాలు కూడా ఎక్కువే. ప్రభుత్వ, ప్రైవేటు పట్టా భూములతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లలో వెలిసిన ఖాళీ ప్లాట్ల సరిహద్దుల విషయంలో తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. భూ విస్తీర్ణం సహా సరిహద్దుల నిర్ధారణ కోసం ప్రైవేటు సర్వేయర్లను సంప్రదిస్తారు. వారిచ్చే రిపోర్టులపై విశ్వసనీయత లేకపోవడంతో మెజార్టీ భూ బాధితులు ప్రభుత్వ సర్వేయర్లను ఆశ్రయిస్తుంటారు. జిల్లా నిష్పత్తి మేరకు సర్వేయర్లు లేకపోగా, ఉన్నవారు కూడా చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల నిర్ధారణ, రీజినల్ రింగ్‌రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, ఫోర్త్‌సిటీ కోసం చేపట్టే భూ సేకరణలో బిజీగా మారారు. ఫలితంగా భూముల సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న 2,500 మందికిపైగా భూ బాధితులకు నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. పక్కనే ఉన్న హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పని చేస్తున్న సర్వేయర్లను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి పని పూర్తి చేయించే అవకాశం ఉన్నా.. జిల్లా అధికారులు ఆ దిశగా ఆలోచించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ప్రాజెక్టుల్లోనే వాళ్లంతా బిజీ
హైదరాబాద్ జిల్లాలో ఖాళీ స్థలాలు పెద్దగా లేవు. 16 మండలాలకు గాను 19 మంది సర్వేయర్లు ఉన్నారు. ఇక్కడ భూ వివాదాలు కూడా చాలా తక్కువ. వీరికి పెద్దగా పని కూడా లేదు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 15 మండలాలు ఉండగా, 18 మంది సర్వేయర్లు ఉన్నారు. ఇక 27 మండలాలు ఉన్న కీలకమైన రంగారెడ్డి జిల్లాలో మాత్రం 14 మందే ఉన్నారు. రెండు, మూడు మండలాలకు ఒక సర్వేయర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ప్రభుత్వ భూముల సర్వేకు తోడు.. ప్రాజెక్టులు, రోడ్ల కోసం ప్రభుత్వం చేపట్టే భూ సేకరణలో వీరంతా బిజీగా మారుతున్నారు. సాధారణ భూ బాధితులు సర్వే కోసం దరఖాస్తు చేసి నెల రోజులు దాటినా.. అటు వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలనే భూ బాధితుల్లో ఉన్న బలహీనతను కొంతమంది సర్వేయర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఏరియా, భూమి విలువ, విస్తీర్ణాన్ని బట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. గతంలో గండిపేట మండల సర్వేయర్ ఒకరు ఇదే అంశంపై పట్టుబడటం విశేషం.
ఉద్దేశపూర్వకంగానే..
జిల్లా అవసరాలు, సర్వేయర్ల కొరత, తలెత్తుతున్న సమస్యలను ముందే గుర్తించి ప్రభుత్వానికి తగిన నివేదిక అందజేయాల్సి ఉంది. కానీ ఓ జిల్లా స్థాయి అధికారి ఉద్దేశపూర్వకంగానే కొత్త సర్వేయర్ల కేటాయింపు అభ్యర్థన ఫైలును తొక్కిపెడుతున్నట్లు తెలిసింది. అత్యవసర పరిస్థితుల్లో.. సరిహద్దు జిల్లాల్లో పని చేస్తున్న సర్వేయర్ల సేవలను వినియోగించుకునే అవకాశం ఉన్నా.. జిల్లాపై తనకున్న గుత్తాధిపత్యం ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోననే భయంతో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఉద్దేశ పూర్వకంగానే సర్వేయర్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అంతేకాదు సర్వేయర్ ఏసీబీ కేసులో పట్టుబడి ఖాళీగా ఉన్న మణికొండ సహా, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం, హయత్‌నగర్, బాలాపూర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కొత్తూరు, నందిగామ మండలాల్లో తనకు అనుకూలమైన వారిని నియమించుకుని, వారి ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.
గ్రేటర్ జిల్లాల్లో సర్వేయర్లు ఇలా..
జిల్లాపేరు మండలాలు సర్వేయర్లు
హైదరాబాద్ 16 19
మేడ్చల్ 15 18
రంగారెడ్డి 27 14
Comments
Please login to add a commentAdd a comment