
బొంతపల్లి చెరువులో చేరిన కాలుష్య జలం
● వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు
● పట్టించుకోని పీసీబీ అధికారులు
జిన్నారం(పటాన్‌చెరు): అసలే వర్షాకాలం..అందులో కాలుష్య జలాలను వర్షపు నీటిలో వదులుతున్నారు. దీంతో చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయి. పొలాలు దెబ్బతింటున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా పీసీబీ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి, దోమడుగు, మంబాపూర్ తదితర గ్రామాలు పారిశ్రామిక ప్రాంతాలు. ఈ పారిశ్రామిక వాడల్లో సుమారు 250 భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో 80 శాతం రసాయన పరిశ్రమలు ఉన్నాయి. 20 ఏళ్లక్రితం ఈ ప్రాంతాల్లో భారీగా రసాయన పరిశ్రమలు వెలిశాయి. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పర్యావరణ వేత్తలు ఈ సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టులో
కేసు కూడా వేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
ఖాజీ చెరువులోకి పారుతున్న కాలుష్య జలం
భూగర్భ జలాలు కలుషితం
సుమారు వెయ్యి అడుగుల వరకు ఉన్న బోరు నుంచి పసుపు రంగులో నీరు బయటకు వస్తుంది. అంటే ఇక్కడి భూగర్భ జలాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాలుష్య ప్రభావానికి పంట పొలాల్లోని బోర్లు చీకిపోయి పడిపోయాయి. బోర్ల వద్ద భూమిలోని ఇనుప పైపులు కాలుష్య జలాల ప్రభావానికి వంగి పోతున్నాయి. దీంతో రైతులు బోర్లు వేయటం కూడా విరమించుకున్నారు. భూగర్భంలో స్వచ్ఛమైన నీరు రావాలంటే మరో 20 ఏళ్లు పట్టొచ్చని పర్యావరణ వేత్తలు, అధికారులు చెబుతున్నారు.
ఘాటు వాసనలు
పారిశ్రామిక వాడల్లోని ప్రజలు నిత్యం కాలుష్య వాయువులను పీలుస్తున్నారు. నిబంధనలను సైతం లెక్క చేయకుండా పరిశ్రమల యజమాన్యాలు ఎలాంటి అనుమతులు లేని కొత్త ఉత్పత్తులను తయారు చేస్తూ భారీగా వ్యర్థాలను వదులుతున్నాయి. అంతేకాక ఘాటు వాయువులను బహిరంగంగా రాత్రి సమయంలో విడుదలచేస్తున్నాయి. దీంతో శ్వాస పీల్చుకోవటం ఇక్కడి ప్రజలకు కష్టమవుతుంది.
ప్రాణాంతకమై వ్యాధులతో ఇబ్బందులు..
వాయు, జల కాలుష్యం వల్ల పారిశ్రామిక వాడల ప్రజలు ప్రాణాంతక వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయంటే ఇక్కడి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడుతున్నారు. వాటితో పాటు చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు, నిమోనియా, ఆస్థమా, టీబీ లాంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చిన్నారుల్లో పెరుగుదల కూడా లోపిస్తుంది. బుద్ధిమాంద్యం, జ్ఞాపక శక్తి వంటి సమస్యలతో అల్లాడుతున్నారు.
చెరువులు, కుంటల్లో కాలుష్య జలాలే..
మండలంలోని పారిశ్రామిక వాడల్లో గల కుంటలు, చెరువులు కాలుష్యం కారణంగా కలుషితమయ్యాయి. వర్షాల సాగుకుతో వర్షపునీటితో వ్యర్థ జలాలను భారీగా చెరువులు, కుంటల్లోకి వదులుతున్నారు. బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం గ్రామాల్లోని సుమారు 30 కుంటలు, 10 చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. ఖాజీ చెరువులోని కాలుష్యమట్టిని తొలగించి, ప్రక్షాళన చేయాలని 16 ఏళ్ల్ల క్రితమే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా అధికారులు పట్టించుకోలేదు.
స్వచ్ఛమైన గాలి కూడా కరువే..
పరిశ్రమలు వదులుతున్న కాలుష్యం వల్ల గాలి పూర్తిగా కలుషితమవుతోంది. గాలిలో విషవాయువులు పేరుకుపోతుండటంతో ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా హైడ్రోజన్ సల్ఫైడ్, క్లోరిన్, మెరికాప్ట, అన్ని రకాల సల్ఫర్ కాంపౌండులు గాలిలో కలుస్తున్నాయి. దీంతో ప్రజలు వివిధ రకాల రోగా ల బారిన పడుతున్నారు. గాలిలో 21 శాతం ఆక్సిజన్ ఉండాల్సి ఉండగా, కాలుష్యం, ఇతర కారణాల వల్ల 19 శాతానికి తగ్గిందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
వర్షాకాలం వస్తే అంతే..
రసాయన పరిశ్రమల యాజమాన్యాలకు వర్షాకాలం వచ్చిందంటే పండగే. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను వర్షం నీటితో కలిపి బయటకు వదులుతుంటారు. దీంతో చెరువులు, కుంటలు పూర్తిగా కలుషితమవుతున్నాయి.
వర్షాకాలంలో వ్యర్థ జలాలను బయటకు రాకుండా చర్యలు తీసుకోవడంలో పీసీబీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సమస్య
చాలా వరకు తగ్గింది
ప్రస్తుతం కాలుష్య సమస్య పారిశ్రామిక వాడల్లో చాలా వరకు తగ్గింది. కలుషిత జలాలను, వాయు కాలుష్యాన్ని బయటకు వదులుతున్న పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలంలో వ్యర్థ జలాలు బయటకు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశాం.
– కుమార్‌పాఠక్, పీసీబీ, ఈఈ