
కట్టుకున్నోడే కడతేర్చాడు
సిద్దిపేట కమాన్: అనుమానాస్పదంగా కుళ్లిన స్థితిలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళ కేసును టెక్నాలజీ ఉపయోగించి సిద్దిపేట టూటౌన్ పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్తే నిందితుడని పోలీసులు తేల్చారు. సిద్దిపేట ఏసీపీ మధు, టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం, తల్వార్బంధ గ్రామానికి చెందిన బోలరాం హరిజన్ అలియాస్ సోను (20) అదే రాష్ట్రానికి చెందిన మైనర్ బాలిక(17)ను కొద్ది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా బిహార్ నుంచి సిద్దిపేటకు ఆరు నెలల క్రితం వచ్చి దక్కల కాలనీ మేర సంఘం భవనం సమీపంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బోలరాం హరిజన్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. హరిజన్ మద్యానికి బానిసై ప్రతిరోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. గత నెల 14న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి తన భార్యతో గొడవపడ్డాడు. కోపంలో హరిజన్ తన భార్య తలను గోడకు బాది, గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఏమి చేయాలో తెలియక మృతదేహాన్ని పక్కనే ఉన్న మేర సంఘం భవనం నీటి సంపులో పడేసి నిందితుడు బిహార్‌కు పారిపోయాడు. సుమారు పదిహేను రోజుల తర్వాత ఈ నెల 1న మేర సంఘ భవనం సంపులో కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై సంఘం భవనం అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీ సాయంతో పోలీసులు నిందితుడిని గుర్తించి కేసును ఛేదించారు. నిందితుడు బలరాం హరిజన్ సిద్దిపేటలోని అద్దె గదిలో ఉన్న తన సామగ్రి తీసుకెళ్లడానికి బిహార్ నుంచి సిద్దిపేటకు శనివారం వచ్చాడు. విషయం తెలుసుకున్న సీఐ ఉపేందర్, ఏఎస్‌ఐ యాసిన్‌మియా, క్రైం కానిస్టేబుళ్లు కనకరాజు, సుధాకర్‌రెడ్డి, యాదగిరి, ప్రశాంత్‌లతో కలిసి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో తన భార్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన క్రైం పార్టీ సిబ్బందిని ఏసీపీ అభినందించి, త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు.
భార్య హత్య కేసులో భర్త అరెస్టు
మృతురాలు బిహార్‌కు చెందిన మైనర్
అనుమానాస్పద స్థితిలో
మృతదేహం గుర్తింపు
కేసును ఛేదించిన టూటౌన్ పోలీసులు