ఉగాదికే సన్నబియ్యం | - | Sakshi
Sakshi News home page

ఉగాదికే సన్నబియ్యం

Published Sat, Mar 22 2025 9:11 AM | Last Updated on Sat, Mar 22 2025 9:10 AM

● అదే రోజు పథకంప్రారంభించనున్న ప్రభుత్వం ● ఏప్రిల్‌ 1నుంచి అమలు ● జిల్లాలో 3.78 లక్షలకార్డుదారులకు మేలు

నారాయణఖేడ్‌: పేదలకు రేషన్‌ కార్డులపై సన్న బియ్యంను ఉగాది నుంచి సరఫరా చేసేందకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా గతంలోనే సన్న బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినా సన్న బియ్యం లేని కారణంగా వాయిదా వేసి ఉగాది నుంచి అందజేస్తామని ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా పథకాన్ని ప్రారంభించి ఏప్రిల్‌ 1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యంను అందజేస్తారు. పథకం ద్వారా జిల్లాలో 3.78లక్షల రేషన్‌ కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 846 రేషన్‌ దుకాణాల ద్వారా 3.78లక్షల మంది కార్డుదారులకు కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున 8వేల మెట్రిక్‌ టన్నుల బియ్యంను అందిస్తున్నారు. జిల్లాలోని కార్డుదారులందరికీ సన్న బియ్యం ద్వారా మేలు చేకూరనుంది.

సీఎం చేతుల మీదుగా..

ఉగాది పర్వదినం రోజైన ఈనెల 30న సన్న బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిల్లో పథకాన్ని ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తూ రైతులను సన్నాల సాగువైపు మళ్లించాలని సైతం ప్రభుత్వం యోచిస్తోంది. సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్‌ చెల్లించే పథకాాన్ని సైతం అమలు చేస్తోంది. ధాన్యం కనీస మద్దతు ధరపై అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తూ సన్నాల సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కావాలని, ఇందుకు 36లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అవసరం అని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో ఇదివరకు సేకరించిన సన్నవడ్ల ద్వారా మరాడించగా 8లక్షల టన్నులు వచ్చిన సన్న బియ్యం ఆయా పౌరసరఫరాల గోడౌన్లలో నిల్వ ఉంచారు. మిల్లుల్లో ప్రస్తుతం మరాడిస్తున్న సన్న బియ్యం వచ్చే నాలుగు నెలల వరకు సరిపోగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సన్న బియ్యం కోసం ఎదురుచూస్తున్న పేదలకు పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది.

రీసైక్లింగ్‌ నిరోధానికే..

పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్న దొడ్డుబియ్యం చాలామంది భోజనానికి ఉపయోగించడంలేదని, దళారులు కిలోకు రూ.10 నుంచి రూ.20లోపు వీరి వద్ద కొనుగోలు చేసి రీసైక్లింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని ఇస్తేనే రీసైక్లింగ్‌ అక్రమాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలం సీజన్‌ నుంచి సన్నధాన్యం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సన్నబియ్యం సాగుచేసి విక్రయించిన రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ కూడా చెల్లిస్తుంది. ఇలా వచ్చిన సన్నవడ్లను మర ఆడించిన సన్నబియ్యంను ఆయా పౌరసరఫరాల గోడౌన్లకు సరఫరా చేసి అక్కడి నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారుకు అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement