8న పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

8న పుస్తకావిష్కరణ

Published Wed, Apr 2 2025 7:32 AM | Last Updated on Wed, Apr 2 2025 7:32 AM

8న పు

8న పుస్తకావిష్కరణ

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో 8న నందిని సిధారెడ్డి కథా సంపుటి బందారం కథలు పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని మంజీరా రచయితల సంఘం ప్రతినిధులు తెలిపారు. సభకు సంబంధించిన కరపత్రాన్ని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ.. సిధారెడ్డి కవిగా సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడని అన్నారు. ఆయన స్వగ్రామమైన బందారంలో తన జీవిత అనుభవ సారాన్ని కథలుగా రూపొందించి బందారం కథలు పేరిట వెలువరించారని తెలిపారు. సభకు కవులు, రచయితలు, సాహిత్య కారులు, గాయకులు, కళాకారులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాదగిరి, రాజిరెడ్డి, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

పేదల కోసం పని చేసేది

కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి

కొండపాక(గజ్వేల్‌): పేదల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దమ్మక్కపల్లి, కొండపాక గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధనికులతోపాటు పేదలు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతినెలా పేదలకు రేషన్‌ దుకాణాల్లోంచి సన్న బియ్యం పంపిణీ జరిగేలా రెవెన్యూ అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు దిలీప్‌ నాయక్‌, సుజాత, ఆర్‌ఐలు బాలకిషన్‌, సత్యనారాయణ, ఎంపీడీఓలు వెంకటేశ్వర్లు, రాంప్రసాద్‌, రేషన్‌ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇసుక డంప్‌ సీజ్‌

బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్ల శివారులో డంప్‌ చేసిన ఇసుకను జేసీబీతో టిప్పర్‌లో లోడ్‌ చేస్తుండగా మంగళవారం టాస్క్‌ఫోర్స్‌, బెజ్జంకి పోలీసులు పట్టుకున్నట్లు ఏఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేయగా ఇసుకతోపాటు జేసబీ, టిప్పర్‌లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మహిళ అదృశ్యం

గజ్వేల్‌రూరల్‌: మహిళ అదృశ్యమైన ఘటన గజ్వేల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వర్గల్‌ మండలం నాచారం గ్రామానికి చెందిన శీల సత్యనారాయణ, జ్యోతి(35) దంపతులకు 15 ఏళ్ల కిందట వివాహం జరుగగా వీరికి ముగ్గురు సంతానం. జ్యోతి సోమవారం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి వైద్యం చేయించుకునేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతుకగా ఆచూకీ లభించలేదు. మంగళవారం గజ్వేల్‌ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి యువకుడు మృతి

మెదక్‌ మున్సిపాలిటీ : స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మెదక్‌ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ నాగరాజు కథనం మేరకు.. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌ చెందిన ఎండీ హఫీజ్‌(20) రంజాన్‌ పండుగ కోసం మెదక్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. బంధువులతో కలిసి స్థానిక గాంధీ నగర్‌లో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌కు వెళ్లాడు. అతడితోపాటు వెళ్లిన వారు నీటిలో స్నానం చేస్తుండగా గట్టుపై చూస్తున్నాడు. ఈ క్రమంలో హఫీజ్‌ ఈత కొట్టేందుకు ఒక్కసారిగా పూల్‌లోకి దూకాడు. ఈత రాకపోవడంతో పూల్‌ లోతు ఉండి నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

8న పుస్తకావిష్కరణ 
1
1/1

8న పుస్తకావిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement