
నాణ్యమైన భోజనం అందించండి
● విద్యార్థుల కోసం పోచమ్మ ఆలయం వద్ద బస్సులు ఆపండి ● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ● బాలికల వసతి గృహం తనిఖీ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలోని మెదక్ రోడ్డు పోచమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలంటూ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్.. డీఎంకు ఫోన్‌లో సూచించారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల బీసీ వసతి గృహాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోచమ్మ ఆలయం వద్ద బస్సుల నిలుపడంలేదని దృష్టికి తెచ్చారు. వెంటనే అదనపు కలెక్టర్ స్పందిస్తూ డీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా? అని తెలుసుకున్నారు. ఇరుకుగదులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తెలుపగా, త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహార పరిమాణం పెంచాలని హాస్టల్ వార్డెన్‌కు సూచించారు. స్టోర్ రూంలో బియ్యం, కూరగాయలు, ఇతర అహార పదార్థాలను పరిశీలించారు. బియ్యం నిల్వల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వార్డెన్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, సిద్దిపేట అర్బన్ తహశీల్దార్ సలీం తదితరులు పాల్గొన్నారు.